KTR: కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికాడు.. రేవంత్‌కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి తెలియదు: కేటీఆర్

- కల్వకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్
- రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజం
- కాంగ్రెస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్న మాజీ మంత్రి
- స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు మళ్లీ నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్య
- ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్‌గల్‌లో నిర్వహించిన రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, ఆ పార్టీ నేతలు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరని కేటీఆర్ తెలిపారు.
"కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికాడు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి తెలియదు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని డ్రామాలు ఆడుతున్నారు. ఆయన సీఎం అయ్యాక సోనియా గాంధీ పుట్టినరోజు రెండుసార్లు వచ్చింది. కానీ, రుణమాఫీ 25 శాతం కూడా రాలేదు. 35 సార్లు ఢిల్లీ విమానం ఎక్కి, 35 పైసలు కూడా తీసుకురాలేదు.
అప్పులు కట్టలేదని రైతుల ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు. రేపో మాపో పుస్తెలతాడు సైతం లాక్కెళ్లిపోతారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. కులగణన పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు సొంతూరు, అత్తగారి ఊరు కల్వకుర్తిలో ఏమైనా చేశారా? అని అడగడానికి ఇక్కడకు వచ్చాం" అని కేటీఆర్ అన్నారు.