Palla Srinivasa Rao: ఇదీ వంశీ చరిత్ర... ఏ మొహం పెట్టుకుని పరామర్శిస్తావ్ జగన్ రెడ్డీ?: పల్లా శ్రీనివాసరావు

- కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్
- విజయవాడ జైల్లో వంశీని పరామర్శించిన జగన్
- కూటమి ప్రభుత్వంపై విమర్శలు
- జగన్ కు బహిరంగ లేఖ రాసిన పల్లా
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం తెలిసిందే. విజయవాడ జైల్లో ఉన్న వంశీని వైసీపీ అధినేత జగన్ ఇవాళ పరామర్శించారు. అనంతరం, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు... జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినందుకు మద్దతు ఇస్తున్నారా... జగన్ మోహన్ రెడ్డి గారు..? అంటూ ప్రశ్నించారు. జైలులో ఉన్న దళిత వ్యతిరేకి, మహిళా ద్రోహి వంశీని పరామర్శించేందుకు వచ్చారా జగన్...? అని నిలదీశారు.
దోపిడిదారుడు వంశీని ఎందుకు ములాఖత్ అయ్యారో సమాధానం చెప్పాలి...? అని స్పష్టం చేశారు. ఈ మేరకు పల్లా శ్రీనివాస్ తన లేఖలో జగన్ కు 10 పాయింట్లు సంధించారు.
1. దళిత ఉద్యోగి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి హింసించి హత్య చేస్తానని బెదిరించి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీని దిక్కరించిన వంశీని ఏ మొహం పెట్టుకుని పరామర్శిస్తావ్ జగన్ రెడ్డీ... నీకు దళితుల కన్నా నేరస్థుడు ఎక్కువైపోయాడా...?
2. ప్రజాస్వౌమ్య దేవాలయం అసెంబ్లీలోనే దుశ్శాసనుడిలా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన నేరస్థుడిని ఏ రకంగా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..? మహిళల వ్యక్తిత్వం కన్నా నేరస్థుడు వంశీ ఎక్కువైపోయాడా...?
3. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిలువునా తగలబెట్టించి గన్నవరం మహిళ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వారాల తరబడి హింసించిన వంశీని ఎలా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..?
4. తల్లి, చెల్లిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించిన నీకు.. ఇతర మహిళలపైన గౌరవం ఉంటుందా..?
5. సంకల్ప సిద్ధి చిట్ ఫండ్స్ కు సంబంధించి 16 వేల మంది కుటుంబాలను రోడ్డున పడేసిన వంశీని ఎలా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..?
6. పట్టిసీమ గట్టు మట్టిని అక్రమంగా తరలించిన రైతుల ద్రోహిని ఎలా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..?
7. గన్నవరం నియోజకవర్గం ప్రజలకు 11 వేల దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కలను దూరం చేసిన వంశీకి ఏవిధంగా మద్దతు పలుకుతావ్ జగన్ రెడ్డి..?
8. బాపులపాడు, గన్నవరం, మండవల్లి ప్రాంతాల్లో చెరువులను, కొండలను అక్రమంగా తవ్వించి అమ్ముకున్న గ్రావెల్స్ మాఫియా వంశీకి మద్దతు ఎలా ఇస్తావు జగన్...?
9. ఎయిర్ పోర్టు భూములను సైతం కబ్జా చేసిన వంశీని ఎందుకు కలుస్తున్నారో అత్మపరిశీలన చేసుకో జగన్ రెడ్డి.
10. విజయవాడ రూరల్ మండలంలో ఉన్న 9 గ్రామాల్లో కబ్జా చేసిన వంశీని ఎందుకు పరామర్శిస్తున్నావ్ జగన్ రెడ్డి..?