SKN: తెలుగు హీరోయిన్ల గురించి నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: నిర్మాత ఎస్కేఎన్

Producer SKN clarifies on backlash on his comments

  • ఓ సినీ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ 
  • తెలుగమ్మాయిలను ఇక ప్రోత్సహించేది లేదని ఎస్కేఎన్ అన్నట్టుగా వార్తలు
  • ఓ వీడియో సందేశంలో వివరణ ఇచ్చిన నిర్మాత

ఇటీవల ఓ సినీ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు ఇస్తే, ఆ తర్వాత ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందేనని, అందుకే ఇకపై తాము తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా ఎంకరేజ్ చేయదల్చుకోలేదని ఎస్కేఎన్ అన్నట్టుగా కథనాలు వచ్చాయి. తన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తుండడంతో నిర్మాత ఎస్కేఎన్ వివరణ ఇచ్చారు. 

తెలుగు హీరోయిన్లతో ఇకపై తాను పనిచేయబోనన్నట్టుగా, తెలుగమ్మాయిలతో ఇబ్బందులు వస్తున్నాయని తాను అన్నట్టుగా కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ చానళ్లలో వార్తలు వచ్చాయని వెల్లడించారు. 

"ఈ మధ్య కాలంలో తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా పరిచేయం చేసిన అతి కొద్ది మంది నిర్మాతల్లో నేను ఒకరిని. రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, ఖుషితలను పరిచయం చేశాం. నెక్ట్స్ హారిక, మరో కొత్త అమ్మాయిని కూడా పరిచయం చేయబోతున్నాం. ఈషా రెబ్బా, ప్రియా వడ్లమాని, ఇనాయాలను కూడా పరిచయం చేశాం.

తెలుగు జర్నలిస్టుగా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి తెలుగు వాళ్లను ప్రోత్సహించాలని కోరుకుంటాను. నాకు తెలిసి 25 మంది అమ్మాయిలను హీరోయిన్లుగా, రైటర్లుగా, ఆర్ట్ డైరెక్టర్లుగా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా, డైరెక్టర్లుగా ప్రోత్సహించాను. ఎవరికైనా మొదటి అవకాశం ఇవ్వడం ఎంతో ఇంపార్టెంట్ విషయం. 

నా రాబోయే 3 చిత్రాల్లో కూడా తెలుగమ్మాయిలే పనిచేస్తున్నారు. అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగమ్మాయే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగమ్మాయే, రైటర్ కూడా తెలుగమ్మాయే. ఇంతమంది తెలుగమ్మాయిలను మేం ప్రోత్సహిస్తున్నాం. కానీ, కొంచెం సరదాగా చేసిన వ్యాఖ్యలను పట్టుకుని, తెలుగమ్మాయిలతో ఇక వర్క్ చేయొద్దు అని అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. 

నేను జోక్ గానే ఆ వ్యాఖ్యలు చేశాను. నేను తెలుగమ్మాయిలను ప్రోత్సహించడాన్ని ఉద్యమంగా తీసుకుని ముందుకు వెళుతున్నాను. నా రాబోయే చిత్రాల్లో కూడా తెలుగమ్మాయిలకే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, ఇకపై ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయొద్దని కోరుతున్నాను" అంటూ ఎస్కేఎన్ ఓ వీడియో సందేశం విడుదల చేశాఉ.

  • Loading...

More Telugu News