Maha Kumbh Mela: మిగిలింది మ‌రో 8 రోజులే... మ‌హా కుంభ‌మేళాకు మహా రద్దీ...!

maha kumbhmela left only 8 days

మహా కుంభ‌మేళాకు మిగిలింది 8 రోజులే
దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే
ట్రాఫిక్ స‌మ‌స్య‌... 10 కి.మీ ప్ర‌యాణానికి 4 గంట‌ల టైం


144 ఏళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఆధ్యాత్మిక వేడుక మ‌హా కుంభ‌మేళా ముగియ‌డానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన ఈ ఆధ్యాత్మిక సంరంభం మ‌రో 8 రోజుల్లో ముగియ‌నుంది. ఫ‌లితంగా ప్ర‌యాగ్‌రాజ్‌కు భ‌క్తుల తాకిడి  బాగా పెరుగుతోంది. 

మ‌హా కుంభ‌మేళాకు వెళ్లే అవ‌కాశం మ‌ళ్లీ రాద‌నే అభిప్రాయంతో భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పోటెత్తుతున్నారు. ఫ‌లితంగా దేశ‌వ్యాప్తంగా దార్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే సాగుతున్నాయి. గ‌త 37 రోజుల్లో  53.24 కోట్లకు పైగా భక్తులు మ‌హాకుంభ‌మేళాలో పుణ్య స్నానాలు చేశారు. ఎక్కువ‌గా రోడ్డు మార్గంలోనే భ‌క్తులు వ‌స్తుండ‌టంతో ట్రాఫిక్ జామ్ స‌మ‌స్య ఏర్ప‌డుతోంది. 

సోమవారం రాత్రి మ‌హా కుంభ్ స‌మీప ప్రాంతాలైన నైని న‌యా వంతెన‌, ఫాఫ‌మౌలో 10-12 కి.మీ మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. 8 నుంచి 10 కి.మీ ప్ర‌యాణం చేయ‌డానికి 3-4 గంట‌లు ప‌ట్టింది. వారాంతం త‌ర్వాత ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని అంచ‌నా వేశారు. అయితే సోమ‌వారం కోటి మందికి పైగా భ‌క్తులు మ‌హా కుంభ‌మేళాకు వ‌చ్చారు. మంగ‌ళ‌వారం ఉద‌యం కూడా అక్క‌డ ర‌ద్దీ విప‌రీతంగా ఉంది. 

బయటి నుంచి వచ్చే వాహనాల‌ను ప్ర‌యాగ్‌రాజ్ శివార్ల‌లోనే పోలీసులు ఆపుతున్నారు. అక్కడి నుంచి షటిల్ బస్సులు, ఇ-రిక్షాలు నడుస్తున్నాయి, కానీ భారీ రద్దీ కారణంగా, భక్తులు త్రివేణి సంగమం చేరుకోవడానికి 10-12 కి.మీ నడిచి వెళ్ళవలసి వస్తుంది. 

కాగా కేంద్ర‌మంత్రి ప్ర‌హ్లాద్ జోషి, బాలీవుడ్ న‌టి జూహీచావ్లా మంగ‌ళ‌వారం నాడు ప్ర‌యాగ్‌రాజ్‌లో పుణ్య‌స్నానాలు చేశారు మ‌హాకుంభ‌మేళాకు రావ‌డం త‌న జీవితంలో మ‌రిచిపోలేని అనుభ‌వం అని జూహీచావ్లా పేర్కొన్నారు. మాజీ ఉప‌రాష్ట్ర ప‌తి వెంక‌య్యనాయుడు, ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు ప్ర‌యాగ్‌రాజ్ రానున్నారు. 



Maha Kumbh Mela
pryag raj
  • Loading...

More Telugu News