Raghu Rama Krishna Raju: పులివెందుల ఉప ఎన్నిక.. రఘురామకృష్ణరాజు, బీటెక్ రవిల మధ్య ఆసక్తికర సంభాషణ

- ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాల సందర్భంగా ఆసక్తికర సంభాషణ
- పులివెందులకు ఉప ఎన్నిక రావాలని మొక్కుకో అని రవికి చెప్పిన రఘురామ
- ఉప ఎన్నిక వస్తే పులివెందులకు మీరు ఇన్ఛార్జ్ గా రావాలన్న రవి
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు పలువురు కూటమి నేతలు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సమయంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పులివెందుల టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
పులివెందులకు ఉప ఎన్నిక రావాలని బాగా మొక్కుకో అని రఘురామ చెప్పగా... ఉప ఎన్నిక వస్తే మీరు ఇన్ఛార్జ్ గా రావాలని రఘురామను బీటెక్ రవి కోరారు. ఉప ఎన్నిక వస్తే తప్పకుండా పులివెందులకు ఇన్ఛార్జ్ గా వస్తానని రఘురామ చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఎన్నికల్లో పులివెందులలో జగన్ చేతిలో బీటెక్ రవి ఓడిపోయారు.
మరోవైపు, ఎవరైనా ఎమ్మెల్యే వరుసగా 60 రోజులు సభకు హాజరుకాకపోతే సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుంది. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇదే విధంగా గైర్హాజరు అయితే... ఆయనపై వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రఘురామ, బీటెక్ రవి పులివెందుల ఉప ఎన్నిక గురించి సరదాగా సంభాషించుకున్నారు.