Sheik Hasina: బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతపై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

Sheikh Hasina vows political comeback

  • మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ తీవ్రంగా మండిపడ్డ మాజీ ప్రధాని
  • సొంతగడ్డపై తిరిగి అడుగుపెడతానని, కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ
  • దేవుడు తనను ప్రాణాలతో ఉంచింది అందుకేనన్న హసీనా

‘నా మాతృభూమికి తిరిగి వస్తా.. కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు. దేవుడు తనను ప్రాణాలతో ఉంచింది అందుకేనని అన్నారు. బంగ్లాదేశ్ ప్రజలను ప్రస్తుతం ఉగ్రవాద ప్రభుత్వం పాలిస్తోందని, మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో హసీనా జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతవరకూ ఓపిక పట్టాలని కోరారు.   

జులై- ఆగస్టుల్లో విద్యార్థులు చేసిన ఆందోళనలలో పలువురు పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, విద్యావంతులు, కళాకారులు హత్యకు గురయ్యారని హసీనా గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ హత్యలకు కారణమైన వారిపై యూనస్ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విచారణ కమిటీలను రద్దు చేసి యూనస్ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలపైనా, అధికారులపైనా దాడులు చేయడం యూనస్‌ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా అల్లర్లు ఆగలేదన్నారు. దేశంలో శాంతిభద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆందోళనల్లో మరణించిన పలువురు పోలీసుల కుటుంబాలతో ఈ సందర్భంగా హసీనా మాట్లాడారు.

Sheik Hasina
Bangladesh
Yunus
Protests
  • Loading...

More Telugu News