Gyanesh Kumar cec: ఆ ఇంట్లో ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, వైద్యులు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఫ్యామిలీ సో స్పెషల్

- జ్ఞానేశ్ 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి
- ఆయన ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు అల్లుళ్లు ఐఏఎస్ అధికారులే
- జ్ఞానేశ్ తండ్రి సుబోధ్ గుప్తా వైద్యుడు
ఇంట్లో ఒక ఐఏఎస్ అధికారో.. ఐపీఎస్ అధికారో ఉంటే సహజంగానే ఉబ్బితబ్బిబ్బవుతాం. బంధుమిత్రగణంలో గర్వంగా ఫీలవుతాం. మరి.. ఒకే ఇంట్లో నలుగురు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ఐఆర్ఎస్ అధికారులు ఉంటే.. ? అందునా అదే కుటుంబంలో ఏకంగా 28 మంది వైద్యులు ఉంటే..?
అవును.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా నియమితులైన మాజీ ఐఏఎస్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఇంట్లో ఇలా అంతా ఉన్నతాధికారులు, ఉన్నత వృత్తుల్లో ఉన్నవారే. ఆయన పెద్ద కుమార్తె మేధా రూపం, ఆమె భర్త 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు. మేధా ప్రస్తుతం యూపీలోని కాస్‌గంజ్ జిల్లా కలెక్టర్ గా సేవలందిస్తున్నారు. ఆమె భర్త మనీశ్ బన్సల్ యూపీలోని సహరన్ పూర్ కలెక్టర్ గా నియమితులయ్యారు.
జ్ఞానేశ్ రెండో కుమార్తె అభిశ్రీ ఐఆర్ఎస్ అధికారిణి. ఆమె భర్త అక్షయ్ లబ్రూ ఐఏఎస్ ఆఫీసర్. జ్ఞానేశ్ సోదరుడు మనీశ్ కుమార్ ఐఆర్ఎస్ అధికారి. చెల్లి భర్త ఉపేంద్ర జైన్ కూడా ఐపీఎస్సే. మనీశ్ సోదరి రోలి ఇండోర్‌లో ఒక పాఠశాల నడుపుతున్నారు. జ్ఞానేశ్ కుమార్ గుప్తా పుట్టింది యూపీలోని ఆగ్రాలో. ఆయన తండ్రి సుబోధ్ గుప్తా. తల్లి సత్యవతి. సుబోధ్ గుప్తా సహా ఆయన కుటుంబంలో 28 మంది వైద్యులు ఉన్నట్లు వారి ఇరుగు పొరుగు చెబుతున్నారు.
కాగా, 1988 బ్యాచ్ కేరళ కేడర్‌కు చెందిన జ్ఞానేశ్ కుమార్ తొలుత తిరువనంతపురంలో జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. మన్మోహన్ సింగ్ హయాంలో 2007 నుంచి 2012 వరకు, ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలో సంయుక్త రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రమూక హింసాత్మక చర్యలకు తెగబడటంతో అక్కడి నుంచి 183 మంది భారతీయులను స్వదేశానికి తరలించడంలో కీలకపాత్ర పోషించారు. 2014 లో ఆయన ఢిల్లీలో కేరళ ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు.