Chhaava: అక్బర్, ఔరంగజేబుల గురించే తప్ప పాఠ్యపుస్తకాల్లో శంభాజీ చరిత్ర లేదేం?: ఆకాశ్ చోప్రా

Ex India Star Statement On Chhaava Starts Debate

  • ఛావా సినిమా చూసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన మాజీ క్రికెటర్
  • మరాఠా సామ్రాజ్య పాలకుడి గురించి పాఠశాలలో నేర్పించలేదని వ్యాఖ్య
  • వివాదాస్పదం చేయొద్దంటూ నెటిజన్ల కామెంట్లు

మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో చక్రవర్తి చత్రపతి శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చూసిన తర్వాత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. పాఠ్యపుస్తకాలలో అక్బర్ గురించి, ఔరంగజేబు గురించి చదువుకున్నాం కానీ శంభాజీ మహరాజ్ గురించి ఎక్కడా చెప్పలేదని అన్నారు.

ఛావా సినిమా చూశాక ఇంత గొప్ప చక్రవర్తి గురించి పిల్లలకు ఎందుకు నేర్పించడంలేదని అనిపించిందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. ‘అక్బర్ గొప్ప నాయకుడని, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని స్కూలులో నేర్పించారు, ఔరంగజేబు పేరును ఢిల్లీలో ఓ పెద్ద రహదారికి పెట్టారు. కానీ శంభాజీ గురించి ఎక్కడా చెప్పలేదు. అలా ఎందుకు చేశారు?’ అంటూ ఆకాశ్ చోప్రా ప్రశ్నించారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

‘మీరు చరిత్ర నేర్చుకోలేదా?’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. తాను చరిత్రలో టాపర్ నని, చరిత్రలో 80 శాతం మార్కులు తెచ్చుకున్నానని చోప్రా జవాబిచ్చారు. కొంతమంది నెటిజన్లు ఆకాశ్ చోప్రాను సమర్థిస్తూ కామెంట్లు పెడుతుండగా.. మరికొంతమంది మాత్రం దీనిని వివాదాస్పదం చేయొద్దని అంటున్నారు. కాగా, ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఛావా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శంభాజీ మహరాజ్ గా విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారని సినీ పండితులు మెచ్చుకుంటున్నారు.

  • Loading...

More Telugu News