Abdur Rauf Khan: పాక్ మాజీ క్రికెటర్ దృష్టిలో ప్రస్తుత గొప్ప ఆటగాడు ఎవరంటే..!

- రేపటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
- ఈ మెగా టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న దాయాదుల పోరు
- ఈ నెల 23న దుబాయ్ లో జరగనున్న పాక్, భారత్ మ్యాచ్
- ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ అబ్దుర్ రవూఫ్ ఖాన్ స్పెషల్ చిట్‌చాట్
రేపటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే, ఈ మెగా టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షించేది మాత్రం దాయాదుల పోరే. ఈ నెల 23న దుబాయ్ లో జరగనున్న పాక్, భారత్ మ్యాచ్ కోసం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇండో-పాక్ మ్యాచ్ లో ఇరు జట్లకు చెందిన కొందరు ప్లేయర్లు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. వారిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్ల ఉన్నారు. కాగా, వ్యక్తిగత ప్రదర్శనల విషయానికి వస్తే ప్రధానంగా కోహ్లీ, బాబర్ మధ్య పోలిక పెట్టడం చాలా కాలంగా అభిమానులకు సర్వసాధారణంగా మారింది.
అయితే, ప్రస్తుత క్రికెట్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఇద్దరి కంటే చాలా ముందున్నాడని పాకిస్థాన్ మాజీ పేసర్ అబ్దుర్ రవూఫ్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.
"ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు (కోహ్లీ, బాబర్). కానీ నా అభిప్రాయం ప్రకారం విరాట్ కోహ్లీకి పోలిక లేదు. అతని క్లాస్, స్థిరత్వం, ఒత్తిడిలో ప్రదర్శన ఇవ్వగల సామర్థ్యం అతడిని ఇతరుల నుంచి వేరు చేస్తాయి. బాబర్ ఆజామ్ ఫామ్‌లో ఉంటే అసాధారణమైన ప్లేయర్. కానీ వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన బ్యాటర్ హిట్‌మ్యాన్. రోహిత్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్ అని నేను నమ్ముతున్నాను. అతను కోహ్లీ, బాబర్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాడు" అని రవూఫ్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో అన్నాడు.
కాగా, రాబోయే మ్యాచ్ లో టీమిండియా, పాక్ నుంచి ప్రభావాన్ని చూపగల ఇద్దరు ఆటగాళ్ల గురించి అడిగినప్పుడు, రవూఫ్ భారత జట్టు నుండి హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలను ఎంచుకున్నాడు. అలాగే పాకిస్థాన్ నుంచి మొహమ్మద్ రిజ్వాన్, నసీమ్ షాలను ఎంచుకున్నాడు.