Nepal Student: ఒడిశా యూనివర్సిటీలో ఉండలేమంటే వెనక్కి వచ్చేయండి.. నేపాలీ విద్యార్థులకు ప్రధాని ఓలి సూచన

- ఒడిశా వర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో ఎంబసీ అధికారులతో కౌన్సెలింగ్
- అవసరమైన ఏర్పాట్లు చేశామని విద్యార్థులకు భరోసా
- క్యాంపస్ వదిలి వెళ్లాలన్న ఆదేశాలే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని ఆందోళన
ఒడిశాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న నేపాలీ విద్యార్థిని పాకృతి లామ్సల్ ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. వర్సిటీ హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన క్యాంపస్ లో ఉద్రిక్తతకు దారితీసింది. వర్సిటీలో చదువుతున్న నేపాలీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను క్యాంపస్ వదిలి వెళ్లిపోవాలని వర్సిటీ అధికారులు ఆదేశించారని, ఉన్నపళంగా వెళ్లిపోమంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆందోళనతోనే తమ తోటి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఒడిశాలోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ) లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పాకృతి లామ్సల్ ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని అన్నారు. దీనిపై భారత్ లోని నేపాల్ ఎంబసీ అధికారులు ఇద్దరిని వర్సిటీకి పంపించామని చెప్పారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, వర్సిటీలో ఉండలేమని అనుకుంటే తిరిగి వచ్చేయాలని సూచించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. చదువు పూర్తయ్యేంత వరకూ ఉండిపోతామంటే భారత ప్రభుత్వంతో మాట్లాడతామని.. విద్యార్థుల అభీష్టం మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఓలి తెలిపారు.