Chandrababu: అభిమానిని చూసి కాన్వాయ్ ఆపిన చంద్రబాబు

- మంగళం దారిలో ఒక్కసారిగా కారు ఆపిన సీఎం చంద్రబాబు
- రోడ్డు పక్కన నిలుచున్న అభిమాని బాషాని దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరింపు
- చంద్రబాబు గుర్తు పట్టి పిలిచి పలకరించడంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన బాషా
ఓ అభిమానిని చూసి కాన్వాయ్ ఆపి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలకరించిన ఘటన మంగళం దారిలో చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామంతో ఆ అభిమాని ఖుషీ అయ్యారు. సోమవారం తిరుపతిలో అంతర్జాతీయ టెంపుల్స్ సదస్సులో పాల్గొని తిరుగు పయనమైన సీఎం చంద్రబాబు .. మంగళం దారిలో ఒక్కసారిగా కారు ఆపమని డ్రైవర్‌ను ఆదేశించారు. కారు అద్దం కిందకు దించి తెల్లని జుట్టుతో రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని దగ్గరకు పిలిచి ఏం బాషా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? అంటూ కుశల ప్రశ్నలు వేశారు.
చంద్రబాబు ఆప్యాయ పలకరింపుతో బాషా ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ సందర్భంగా అతను భావోద్వేగానికి గురయ్యాడు. చంద్రబాబు పలకరించిన ఎస్ఏ అజీజ్ బాషా మంగళం సమీపంలోని శేషాచల నగర్‌కు చెందిన సీనియర్ టీడీపీ కార్యకర్త. చంద్రబాబుతో తనకు 40 ఏళ్లుగా పరిచయం ఉందని, ఆయనను చూసేందుకు వచ్చినా, భద్రతా కారణాలతో రోడ్డు పక్కన నిలుచుండిపోయానని బాషా మీడియాతో అన్నారు. చంద్రబాబు తనను చూసి గుర్తుపట్టి పలకరించడం ఈ జన్మకిది చాలు అంటూ బాషా సంతోషాన్ని వ్యక్తం చేశాడు.