Crime News: తన భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని.. యువకుడి కుడిచేతిని నరికేశాడు!

- ఏలూరు జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంలో ఘటన
- తన భార్యతో వివాహేతర సంబంధం వద్దని హెచ్చరిక
- తన భార్యతో ఉన్న సమయంలో పట్టుకుని దాడి
- కుడి చేతిని సగానికి నరికేసిన వైనం.. తీవ్ర రక్తస్రావంతో మృతి
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంలో ఇటీవల జరిగిన మజ్జి ఏసురాజు (26) హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన భార్యతో వివాహేర సంబంధం నెరుపుతున్న ఏసురాజును ఆమె భర్త పలుమార్లు హెచ్చరించాడు. ఏసురాజు ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉండి మండలంలోని అత్తింట్లో తన భార్యతో ఏసురాజు ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.
వెంటనే తన తండ్రి, మరో వ్యక్తికి ఫోన్ చేసి వారిని అక్కడికి రప్పించాడు. అందరూ కలిసి ఏసురాజును పట్టుకుని బావాయిపాలెం తీసుకెళ్లారు. అక్కడ ఏసురాజుపై దాడిచేశారు. తన భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడంటూ ఏసురాజు కుడి చెయ్యిని కత్తితో సగానికి నరికి దూరంగా పడేశాడు. అనంతరం కాపవరం పంట కాలువ రేవులో ఏసురాజును పడేసి ముగ్గురూ పరారయ్యారు. కుడి చేతిని నరికేయడంతో తీవ్ర రక్తస్రావమైన ఏసురాజును ఎవరూ గమనించకపోవడంతో మృతి చెందాడు. నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.