ghee: ఆవు నెయ్యి Vs గేదె నెయ్యి.. మన ఆరోగ్యానికి ఏది మంచిది?

cow ghee vs buffalo ghee which is better

  • నెయ్యి ఒక ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్న ఆయుర్వేదం
  • మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆవు నెయ్యి, గేదె నెయ్యి...
  • ఈ రెండింటిలో ఏది మేలు, ఏ నెయ్యితో ఏ ప్రయోజనం ఉంటుందో వెల్లడించిన నిపుణులు

నెయ్యి.. ఆరోగ్యకరమైన కొవ్వుల సమాహారం. సంపూర్ణ ఆరోగ్యం కోసం తీసుకొనే ఆహారంలో పరిమిత మోతాదులో చేర్చుకోతగ్గ పదార్థం. అయితే ఆవు నెయ్యి వాడటం మంచిదా? లేక గేదె నెయ్యి తీసుకోవాలా? ఎవరికి ఏది సూట్ అవుతుంది? ఊబకాయులు నెయ్యి తినొచ్చా? మరి కొలెస్ట్రాల్ సంగతేంటి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారనేది తెలుసుకుందాం...

ఏ నెయ్యితో ఎలాంటి ప్రయోజనాలు..?
  • వెన్నను కరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి తయారీకి అనుసరించే ప్రక్రియ ఒకటే. కానీ వాటి రంగు మొదలు, పోషకాల్లో తేడాలుంటాయి. అందువల్ల వాటి ప్రయోజనాలు కూడా దేనికవే ప్రత్యేకమైనవి. ఆవు నెయ్యి పసుపు రంగులో ఉంటే గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది.
  • గేదె నెయ్యిలో కేలరీలు ఎక్కువ. అందువల్ల బరువు పెరగాలనుకొనే వారికి ఈ నెయ్యి వాడకం అనువుగా ఉంటుంది.
  • ఇక ఆవు నెయ్యి తక్కువ కేలరీలతో ఉండటం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది. మొక్కలు లేదా జంతు కొవ్వులతో కూడిన ఆహారాల్లో అత్యధికంగా 96 శాతం జీర్ణమయ్యే రేటు ఉన్నది ఆవు నెయ్యికే కావడం గమనార్హం. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
  • ఆరోగ్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం... ఆవు నెయ్యిలో ఎక్కువగా కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇన్సులిన్ స్థాయులను అదుపులో ఉంచుతుంది.
  • మరోవైపు ఎముకల గట్టిదనం కోసం గేదె నెయ్యి ఉపయోగపడితే... గుండె ఆరోగ్యానికి ఆవు నెయ్యి మేలు చేస్తుంది.
  • గేదె నెయ్యిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటే, ఆవు నెయ్యిలో ఏ, డీ విటమిన్లతోపాటు కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. 
  • ఆవు నెయ్యితో పోలిస్తే అధిక కొవ్వుల కారణంగా గేదె నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

ఆయుర్వేదం ఏం చెబుతోంది?
గేదె నెయ్యితో పోలిస్తే ఆవు నెయ్యిలోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా ఆవు నెయ్యిని అత్యంత సాత్వికమైన ఆహారంగా గుర్తించింది. ఆవు పాలలో పాజిటివ్ ఎనర్జీ సారాంశం ఉంటుందని ఆయుర్వేదం నమ్ముతుంది. అందుకే వివిధ వ్యాధుల చికిత్స కోసం తయారు చేసే మూలికా ఔషధాల్లో ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. శరీరంలో రోగం సోకిన భాగానికి మూలికలను చేర్చడంలో ఆవు నెయ్యి ఒక వాహకం (క్యారియర్)గా ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్ర్తం చెబుతోంది. జుట్టు రాలడం, తలనొప్పితో బాధపడే వారికి అందించే నాస్య చికిత్సలోనూ ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు.

ఏ నెయ్యిని ఎలా తీసుకుంటే మేలు..
  • ఆవు నెయ్యిని అన్ని వయసులవారూ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా శారీరక శ్రమకు దూరంగా ఉండే వృద్ధులు, చిన్నారులకు ఆవు నెయ్యి వాడకం అనువైనది.
  • అధిక శక్తి అవసరమైన ఆటగాళ్లు, రెజ్లర్ల వంటి శారీరక శ్రమ చేసే వారు మాత్రమే గేదె నెయ్యిని తీసుకోవాలి. 
  • పెద్దలు నిత్యం ఒకటి రెండు చెంచాల ఆవు నెయ్యి తీసుకోవచ్చు. అదే గేదె నెయ్యి అయితే పెద్దలు రోజుకు 2 టీస్పూన్లు తీసుకోవచ్చు. గర్భిణులు, బాలింతలు రోజుకు 3 టీస్పూన్లు తీసుకోవచ్చు.
  • 17 ఏళ్లలోపు పిల్లలు రోజుకు 3 టీస్పూన్ల నెయ్యిని ఆహారంలో చేర్చుకోవచ్చు.
  • గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు వైద్యుల సూచన ప్రకారమే నెయ్యిని వాడాలి.
  • మెదడు పనితీరును మెరుగుపరచడం, పేగుల ఆరోగ్యం కోసం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో నెయ్యిని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • గేదె నెయ్యి చిక్కగా ఉండటం వల్ల కర్రీల తయారీకి అనువుగా ఉంటుంది. ఆవు నెయ్యి స్వీట్లు, తేలికపాటి వంటకాలు తయారు చేయడానికి సరైనది.

  • Loading...

More Telugu News