CEC: రేపు రాజీవ్ కుమార్ పదవీవిరమణ... కొత్త సీఈసీ కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం

- రేపటితో ముగియనున్న సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం
- కొత్త సీఈసీ కోసం కేంద్రం కసరత్తులు
- అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకత్వం
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ రేపు (ఫిబ్రవరి 18) పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, నూతన సీఈసీ ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ ఓ కీలక నోట్ సమర్పించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎన్నిక కోసం రూపొందించిన చట్టం అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉందని, ఇలాంటి సమయంలో నేడు ఈ సమావేశం నిర్వహించకుండా ఉంటే బాగుండేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడంత పట్టుదలకు పోవాల్సిన అవసరం ఏముందని, సుప్రీం కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఆగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
కాగా, ఈ అంశంలో సుప్రీంకోర్టు ఫిబ్రవరి 22న వాదనలు విననుంది. సీఈసీ ఎంపిక ప్రక్రియను వాయిదా వేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. సీఈసీ నియామకంపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి స్టే విధించనందున, ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీకి మార్గం సుగమం అయిందని ఆ వర్గాలు తెలిపాయి. కోర్టు న్యాయపరమైన అభిప్రాయం కోరడంతో, కోర్టు కోరిన వివరాలు సమర్పించడం జరిగాయని... సీఈసీ ఎంపికకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్రం భావిస్తోందని పేర్కొన్నాయి.
అటు, నూతన సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంపై రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేస్తారని తెలుస్తోంది.