HYDRA: హైదరాబాద్ పరిసరాల్లో ఫామ్ ప్లాట్ల కొనుగోలుపై హైడ్రా కమిషనర్ కీలక సూచన

- అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇబ్బందిపడాల్సి వస్తుందని హెచ్చరిక
- ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉందన్న రంగనాథ్
- లక్ష్మీగూడలో ఫామ్ ప్లాట్ల పేరిట లేఔట్ చేసి అమ్ముతున్నారని ఫిర్యాదులు వచ్చాయని వెల్లడి
హైదరాబాద్ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచన చేశారు. ఫామ్ ప్లాట్ల పేరిట అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేయవద్దని హితవు పలికారు. అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉందని, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మీగూడ గ్రామ సర్వే నెంబర్ 50లోని 1.02 ఎకరాల్లో ఫామ్ ప్లాట్ల పేరిట లేఔట్ వేసి అమ్ముతున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందిందని రంగనాథ్ వెల్లడించారు.
నిబంధనల మేరకు ఎక్కడా ఫామ్ ప్లాట్లను విక్రయించడానికి లేదని ఆయన వెల్లడించారు. ఫామ్ ల్యాండ్ అంటే 2 వేల చదరపు మీటర్లు లేదా 20 గుంటల స్థలం ఉండాలని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఫామ్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయరాదని స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.