Sam Pitroda: చైనా విషయంలో సొంత పార్టీ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలు... స్పందించిన కాంగ్రెస్

- చైనా పట్ల భారత్ వైఖరి ఘర్షణాత్మకంగా ఉంటోందన్న శామ్ పిట్రోడా
- మన విధానం దేశానికి కొత్త శత్రువులను సృష్టిస్తోందని వ్యాఖ్య
- శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ
చైనా విషయంలో భారత్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది.
చైనా విషయంలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబించడం లేదని స్పష్టం చేసింది. విదేశాంగ విధానం, భద్రత, ఆర్థికపరంగా చైనా ఇప్పటికీ సవాలుగానే ఉందని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు.
శామ్ పిట్రోడా ఏమన్నారు?
చైనా పట్ల భారత్ వైఖరి మొదటి నుంచి ఘర్షణాత్మకంగానే ఉందని, మనం అవలంబిస్తున్న ఆ విధానం దేశానికి కొత్త శత్రువులను సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్‌కు సరైన మద్దతు దక్కడం లేదని వ్యాఖ్యానించారు. కేవలం చైనా విషయంలోనే కాదని, ఇతర దేశాలకూ వర్తిస్తుందని ఆయన అన్నారు. అయినప్పటికీ చైనా నుంచి ఏం ముప్పు ఉందో తనకు అర్థం కావడం లేదన్నారు. చైనాను అమెరికా తరచూ శత్రువుగా పేర్కొంటూ, భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోందని విమర్శించారు.