Moinabad Farm House: జడ్జి సమక్షంలో పందెం కోళ్లకు వేలం... భారీ ధర పలికిన కోళ్లు

- మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందేలు
- పందెంరాయుళ్లను, కోళ్లను పట్టుకున్న పోలీసులు
- పట్టుకున్న కోళ్లకు రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో వేలంపాట
హైదరాబాద్ నగర శివారులోని మెయినాబాద్ లో కోడిపందేలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పందెంరాయుళ్లతో పాటు పందెంకోళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఫామ్ హౌస్ లో పట్టుకున్న పందెంకోళ్లను ఈరోజు వేలం వేశారు. రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో కోర్టు సిబ్బంది వేలం నిర్వహించారు. జడ్జి సమక్షంలో పందెంకోళ్ల వేలం జరిగింది. ఉప్పరపల్లి కోర్టు ఆదేశాల మేరకు వేలంపాటను నిర్వహించారు.
వేలంపాటలో 16 మంది అడ్వొకేట్లు, 57 మంది పౌరులు పాల్గొన్నారు. ఇటీవల పట్టుబడ్డ పందెంరాయుళ్లు కూడా వేలంలో పాల్గొనడం గమనార్హం. 10 కోళ్లను ఒక స్లాట్ గా చేసి వేలం నిర్వహించారు. 10 కోళ్ల స్లాట్ ను శ్రీనివాస్ అనే వ్యక్తి రూ. 2,50,000కు కొనుగోలు చేశారు. రూ. 50 వేల నుంచి వేలంపాట మొదలయింది. మొత్తం 84 కోళ్లకు వేలంపాట నిర్వహిస్తున్నారు. వేలంపాట ఇంకా కొనసాగుతోంది.