Chelluboyina Venugopala Krishna: ప్రతిపక్ష నేతలను చంద్రబాబు లొంగదీసుకుంటున్నారు: చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

- చంద్రబాబు రాజకీయం మొత్తం కుట్రలు, కుతంత్రాలేనన్న చెల్లుబోయిన
- నేతల కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబు నిదర్శనమని విమర్శ
- చంద్రబాబు కారణంగా ఏపీకి రూ. 1.10 లక్షల కోట్లు రాలేదని మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయం మొత్తం కుట్రలు, కుతంత్రాలేనని ఆయన విమర్శించారు. నేతల కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబు నిదర్శనమని చెప్పారు. ప్రతిపక్ష నేతలను బలవంతంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఫిర్యాదు చేసిన వ్యక్తులను కూడా ముద్దాయిలుగా మారుస్తున్నారని చెల్లుబోయిన మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో తగినంత బలం లేకపోయినా, నేతలను బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ప్రతిపక్ష నేతలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను లొంగదీసుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రంలోని పౌర సమాజానికి ముప్పు పొంచి ఉందని చెప్పారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికారని ఎద్దేవా చేశారు. కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే నిదర్శనమని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కి పదేళ్ల కాలం ఉన్నప్పటికీ... రాత్రికి రాత్రే చంద్రబాబు ఏపీకి వచ్చేశారని విమర్శించారు. చంద్రబాబు కారణంగా తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 1.10 లక్షల కోట్లు ఏపీకి రాలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి రావడం కోసం వైసీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు.