Health: జామ పండు.. యాపిల్.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం?

- ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినాలన్న సూచన పాతదే...
- కొందరికి జామ పండ్లు ఇష్టం, మరికొందరికి యాపిల్స్ ఇష్టం...
- మరి వీటిలో ఏది ఆరోగ్యకరం అన్నదానిపై నిపుణుల సూచనలివే...
సంపూర్ణ ఆహారంలో భాగంగా మంచి ఆరోగ్యం కోసం పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలన్న సూచన పాతదే. ఇది వాస్తవం కూడా. అయితే కొన్ని రకాల పండ్ల వినియోగంపై కొందరిలో వేర్వేరు నమ్మకాలు ఉంటాయి. ముఖ్యంగా జామ పండ్లు, యాపిల్స్ విషయంలో విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో జామ పండ్లు, యాపిల్స్ లో ఏవి ఆరోగ్యకరం, ఎందుకు, ఎవరెవరికి ఏ పండ్లు అయితే మంచిదన్న దానిపై నిపుణుల సూచనలివీ...
జామ, యాపిల్... దేనిలో ఏ పోషకాలు ఉంటాయి?
- జామ పండ్లలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరానికి ఒక రోజులో అవసరమైన విటమిన్ సీ కంటే... ఒక జామ పండులో రెండింతల విటమిన్ సీ ఉంటుంది. ఇది మనలో ఇమ్యూనిటీని పెంచేందుకు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు, శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.
- అదే యాపిల్ లో విటమిన్ సీ మోతా తక్కువే. మనకు ఒక రోజులో అవసరమయ్యే విటమిన్ సీ లో ఒక యాపిల్ నుంచి కేవలం 14 శాతం మాత్రమే అందుతుందని నిపుణులు చెబుతున్నారు.
- యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువ. ఒక పండులో 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా పెక్టిన్ గా పిలిచే ఉపయోగకరమైన ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది.
- ఒక జామ పండులో 3 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటుంది. కానీ దీనిలో రెండు రకాల ఫైబర్ (ఇన్ సాల్యుబుల్, సాల్యుబుల్)లు ఉంటాయి. అందువల్ల జీర్ణ వ్యవస్థకు మరింత ఎక్కువ మేలు అని నిపుణులు చెబుతున్నారు.
కేలరీల పరంగా చూస్తే ఏది బెటర్?
ఒక సాధారణ యాపిల్ లో సుమారు 95 కేలరీల శక్తి ఉంటే... జామ పండులో 68 కేలరీలు మాత్రమే ఉంటాయి. నిజానికి రెండింటి నుంచి వచ్చే కేలరీలు తక్కువే అయినా... బరువు తగ్గాలనుకునేవారికి జామ పండ్లు బెటర్.
యాపిల్ కన్నా జామ పండ్లలో ప్రోటీన్లు ఎక్కువ. ఒక యాపిల్ నుంచి ఒక గ్రాము ప్రోటీన్ అందితే... జామ పండులో 2.6 గ్రాముల ప్రొటీన్ అందుతుంది. ఈ విషయంలో జామ పండు మంచిదని నిపుణులు చెబుతున్నారు.
శరీరానికి మేలు చేసే అంశంలో...
జామ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ముఖ్యంగా శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించి, ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించే... లైకోపీన్, క్వెర్సెటిన్ వంటివి అధికం. ఇవి శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచుతాయి. గుండె జబ్బులు, కేన్సర్లు రాకుండా దోహదం చేస్తాయి.
యాపిల్స్ లో క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లతోపాటు కటెచిన్స్ గా పిలిచే ఫ్లేవనాయిడ్స్ అధికం. ఇవి కూడా గుండెను సంరక్షించడంతోపాటు ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. అయితే యాపిల్స్ పైన ఉండే తొక్కలోనే ఇవి ఎక్కువ. తొక్కతో తింటేనే లాభమని నిపుణులు చెబుతున్నారు.