Nandigam Suresh: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసు... కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్

- అమరావతి ఉద్యమం సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు
- అప్పట్లో కేసు నమోదు చేసినా... అరెస్టులు చేయని పోలీసులు
- ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సురేశ్ తరపు న్యాయవాదులు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ కేసులో 145 రోజులుగా జైల్లో ఉన్న సురేశ్... అనారోగ్య సమస్యలతో ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా మరో కేసులో ఆయన సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. 2020లో అమరావతి ఉద్యమం సమయంలో అమరావతి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కేసులో ఆయన కోర్టుకు వచ్చారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆయనపై మహాలక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అరెస్టులు మాత్రం జరగలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు విచారణలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే నందిగం సురేశ్ కోర్టులో లొంగిపోయారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం సురేశ్ తరపు న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.