Harish Rao: కేసీఆర్ ఆమరణ దీక్షతో ఢిల్లీ పీఠాన్ని కదిలించారు: హరీశ్ రావు

- కేసీఆర్ దీక్ష చేశారు కాబట్టే 2009 డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందన్న హరీశ్ రావు
- తెలంగాణ ప్రక్రియను ప్రకటిస్తేనే దీక్షను విరమిస్తానని కేసీఆర్ ఆ రోజు చెప్పారని వెల్లడి
- ఫిబ్రవరి 17 ఎంత ముఖ్యమో, నవంబర్ 29 అంతే ముఖ్యమన్న హరీశ్ రావు
కేసీఆర్ పదిహేనేళ్ల క్రితం ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఢిల్లీ పీఠాన్ని కదిలించారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ఆ రోజు దీక్ష చేశారు కాబట్టే 2009 డిసెంబర్ 9 రోజున తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చిందని అన్నారు. కేసీఆర్ దీక్షకు పూనుకోకుంటే తెలంగాణ ప్రకటన వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు.
నిరాహార దీక్ష విరమించాలని నాటి కేంద్రమంత్రి చిదంబరం విజ్ఞప్తి చేస్తే, తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెబితే మాత్రమే విరమిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు దీక్ష సమయంలో కేసీఆర్‌ను చూసి తమకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వివరాలను జయశంకర్ తన స్వహస్తాలతో రాసి ఢిల్లీకి పంపిస్తే, దానినే చిదంబరం ఢిల్లీ నుండి ప్రకటించారని చెప్పారు.
ఫిబ్రవరి 17 (కేసీఆర్ పుట్టిన రోజు) మనకు ఎంత ముఖ్యమో నవంబర్ 29 అంతే ముఖ్యమని ఆయన అన్నారు. చరిత్ర పుటల్లో ఈ రెండు తేదీలు మనకు ముఖ్యమే అన్నారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆ రోజు (2009 నవంబర్ 29) కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారని గుర్తు చేశారు. మనం మహాత్మా గాంధీ సత్యాగ్రహం, పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షలు చూశామని, కేసీఆర్ కూడా అలాగే నిరాహార దీక్ష చేశారని అన్నారు.