Kidney: ఈ ఎనిమిది రకాల ఆహారంతో... కిడ్నీలలో రాళ్లు వచ్చే ప్రమాదం!

- ఇటీవల చాలా మందిలో కిడ్నీల్లో రాళ్ల సమస్య
- మారిన జీవన శైలి సహా ఇందుకు కారణాలు ఎన్నో...
- అయితే కొన్ని రకాల ఆహారంతో కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్న ఆరోగ్య నిపుణులు
మనం తినే ఆహారం, తగినంత నీళ్లు తాగకపోవడం, మారిన జీవన శైలి వంటివి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, అవి జారిపోయి మూత్రనాళం మధ్యలో చిక్కుకోవడంతో విపరీతమైన నడుము నొప్పితో, ఇతర సమస్యలతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. అయితే ఎనిమిది రకాల ఆహారంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని... అందువల్ల బాధితులు వాటికి దూరంగా ఉంటే ప్రయోజనమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్...
ఆక్సలేట్లుగా పిలిచే రసాయన సమ్మేళనాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే... అది కిడ్నీల్లో కాల్షియంతో కలసి, కాల్షియం ఆక్సలేట్ రాళ్లుగా ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలకూర, బీట్ రూట్, చిలగడ దుంప, వాల్ నట్స్, చాకోలెట్ వంటి వాటిలో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. అలాగని వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని... పరిమిత స్థాయిలో తీసుకుంటే మేలు అని పేర్కొంటున్నారు.
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం...
మనం పరిమితికి మించి ఉప్పు తీసుకుంటే... శరీరం నుంచి కాల్షియం బయటికి పోతుందని, ఈ క్రమంలో మూత్రం ద్వారా కాల్షియం బయటికి వెళ్లే క్రమంలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్, సోడియం ఎక్కువగా ఉండే స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు.
మాంసాహార ప్రొటీన్లు...
విపరీతంగా మాంసాహారం అంటే మటన్, చికెన్, గుడ్లు, చేపలు వంటివి తినేవారిలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేగాక మాంసంలోని ప్రొటీన్లు శరీరంలో నుంచి కాల్షియం బయటికి వెళ్లేందుకు కారణం అవుతాయని వివరిస్తున్నారు. ఈ రెండూ కలసి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు దారితీస్తాయని పేర్కొంటున్నారు. అయితే పరిమిత స్థాయిలో మాంసం తీసుకోవడం, తగినన్ని నీళ్లు తాగడం ద్వారా కొంత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
చక్కెర అతిగా ఉన్న ఆహారం, పానీయాలు...
చక్కెర చాలా ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు, సోడాలు, ఇతర పానీయాలు, స్వీట్లు వంటివి కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల చక్కెర స్థాయి తక్కువగా ఉండే పానీయాలు మంచివని సూచిస్తున్నారు.
ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్
ప్యూరిన్లుగా పిలిచే రసాయన సమ్మేళనాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే... శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్గాన్ మీట్, సముద్ర ఉత్పత్తులు, సార్డైన్స్ చేపలు వంటివాటిలో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
పాలు, పాల పదార్థాలు...
మనం రెగ్యులర్ గా తీసుకునే పాలు, పాల పదార్థాల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి కాల్షియం అత్యంత ఆవశ్యకమైనదే అయినా... కొందరిలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు దారి తీస్తుంది. అందువల్ల తగిన మోతాదులో పాలు, పాల పదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కెఫీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు
కాఫీలు, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని పరిమితికి మించి తీసుకుంటే... కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెఫీన్ కు డైయూరిటిక్ లక్షణం ఉంటుంది. అంటే విపరీతంగా మూత్రం వస్తుంటుంది. ఇది శరీరంలో డీహైడ్రేషన్ పరిస్థితికి కారణమై.. రాళ్లు ఏర్పడుతాయి.
ఆల్కాహాలిక్ డ్రింక్స్...
ఆల్కహాల్ కూడా డైయూరిటిక్ లక్షణం ఉన్నదే. అంతేగాకుండా శరీరం నుంచి కాల్షియంను బయటికి పంపేందుకు కారణం అవుతుంది. ఈ రెండు అంశాలు కలిసి కిడ్నీలపై ప్రభావం చూపుతాయని, తద్వారా రాళ్లు ఏర్పడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ అంశాలను గుర్తుంచుకోండి...
పైన చెప్పిన ఆహార పదార్థాలు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు దారితీసే అవకాశం ఉన్నా... వాటిని తీసుకోవడం ఆపవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరిమిత స్థాయిలో తీసుకోవడం మంచిదని, అన్ని రకాల పోషకాలు అందుతాయని వివరిస్తున్నారు. అంతేకాదు... కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రత్యేక లక్షణం కొంత మందిలో ఎక్కువగా ఉంటుందని... అలాంటి వారు మాత్రం ఈ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.