New Delhi: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన... రైల్వే శాఖ కీలక నిర్ణయం

- ప్రత్యేక హోల్డింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం
- అత్యధిక రద్దీ కలిగిన 60 స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ జోన్ల ఏర్పాటు
- స్టేషన్లలో రద్దీ నియంత్రణకు ఏఐని వినియోగించుకోనున్న రైల్వే శాఖ
దేశ రాజధాని న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో మృతి చెందారు. రైలు వద్ద, ప్లాట్‌ఫాంపై గందరగోళంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రైల్వే స్టేషన్‌లలో రద్దీని నియంత్రించే ఉద్దేశంలో భాగంగా ప్రత్యేక హోల్డింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైనట్లుగా సమాచారం. దేశవ్యాప్తంగా అత్యధిక రద్దీ కలిగి ఉండే 60 రైల్వే స్టేషన్‌లలో శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలను నిర్మించాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించినట్లుగా సమాచారం.
రైల్వే స్టేషన్‌లలో రద్దీ నియంత్రణ, విపత్తు నిర్వహణ కోసం కృత్రిమ మేథ (ఏఐ)ని వినియోగించుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఈ మేరకు స్థానిక అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రయాణికులు హోల్డింగ్ ప్రాంతాల వద్దకు వెళ్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం గుర్తులు, ఆయా హోల్డింగ్ ప్రాంతాలకు వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నారు.