Maharashtra: ట్రాఫిక్ ను అధిగమించి... పరీక్ష కేంద్రానికి సమయానికి వెళ్లేందుకు విద్యార్థి ఉపాయం... ఏం చేశాడంటే..!

- మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆసక్తికర ఘన
- పారాగ్లైడింగ్ చేస్తూ సమయానికి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్న విద్యార్థి
- ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్
భారత్ లోని ప్రధాన నగరాలలో చాలా కాలంగా ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారుతోంది. కొంచెం దూరానికి గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి. ఉద్యోగులు సమయానికి ఆఫీస్ కు వెళ్లాలంటే రోజూ అదో పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఇక విద్యార్థులకు కూడా ఈ సమస్య తలనొప్పిగా మారుతోంది. పరీక్షల వేళ సమయానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఈ క్రమంలోనే పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకునేందుకు ఓ విద్యార్థి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏకంగా పారాగ్లైడింగ్ చేస్తూ సమయానికి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నాడు. ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటు చేసుకుంది.
వాయి తాలూకాలోని పసరణి గ్రామానికి చెందిన సమర్థ్ మహాంగడే అనే విద్యార్థి పరీక్షకు 15-20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉండగా భారీ ట్రాఫిక్ లో చిక్కుకుపోతానని గ్రహించి పారాగ్లైడింగ్ ద్వారా అసాధారణ మార్గంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆ విద్యార్థి తన కాలేజీ బ్యాగ్ తో ఆకాశంలో ఎగురుతూ తన పరీక్ష కేంద్రానికి చేరుకోవడం కనిపించింది. ఇందుకోసం అతడికి పంచగనిలోని జీపీ అడ్వెంచర్స్ కు చెందిన సాహస క్రీడా నిపుణుడు గోవింద్ యెవాలే సహాయం చేశాడు.
అతడి సాయంతో విద్యార్థి తన బ్యాగ్ తో ఆకాశంలో ఎగురుతూ సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.