Champions Trophy 2025: కరాచీలోని నేషనల్ స్టేడియంపై క‌నిపించ‌ని భారత జెండా.. పీసీబీపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం!

Indian Flag Controversy In Pakistan Ahead Of Champions Trophy Stadium Video Viral

  • ఈసారి ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాక్‌
  • భార‌త జ‌ట్టు దాయాది దేశానికి వెళ్లేందుకు స‌సేమీరా
  • దాంతో హైబ్రిడ్ మోడ్ లో టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు ఐసీసీ మొగ్గు
  • దుబాయ్ వేదిక‌గా త‌న మ్యాచ్ లు ఆడ‌నున్న టీమిండియా
  • ఈ నేప‌థ్యంలో పీసీబీ వ‌క్ర‌బుద్ధి.. క‌రాచీ స్టేడియంపై భారత జెండాను ప్ర‌ద‌ర్శించ‌ని వైనం

ఈసారి ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, భ‌ద్ర‌త దృష్ట్యా త‌మ జ‌ట్టును దాయాది దేశానికి పంపించ‌బోమ‌ని బీసీసీఐ లేల్చిచెప్ప‌డంతో ఐసీసీ ఈ టోర్న‌మెంట్ ను హైబ్రిడ్ మోడ్ లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. దాంతో భార‌త్ త‌న మ్యాచ్ ల‌ను దుబాయ్ వేదిక‌గా ఆడ‌నుంది. 

ఇక భార‌త జ‌ట్టు త‌మ దేశానికి రాక‌పోవ‌డంపై పాక్ గుర్రుగా ఉంది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా చేసిన ఒక చర్యపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కరాచీలోని నేషనల్ స్టేడియంపై ఈ టోర్నీ ఆడుతున్న ఎనిమిది దేశాల‌లో ఏడు దేశాల జెండాల‌ను ఉంచిన పీసీబీ... భార‌త జాతీయ ప‌తాకాన్ని మాత్రం ప్ర‌ద‌ర్శించ‌లేదు. 

చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇతర దేశాల జెండాలు వేదిక వద్ద కనిపించినప్పటికీ, భారత జెండా కనిపించడం లేదు. క‌రాచీ స్టేడియం తాలూకు వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాంతో నెటిజ‌న్లు ఇది పాక్ వ‌క్ర‌బుద్ధిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

అయితే, భారత జెండా లేకపోవడం వెనుక క‌చ్చితమైన కారణం తెలియకపోయినా, భారత జట్టు తన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లన్నింటినీ దుబాయ్ లో ఆడుతుండటం దీనికి కారణం కావచ్చని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక కరాచీ స్టేడియం ఈ టోర్నీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. 

ఈ నెల 19న చాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం అవుతుంది. మొత్తం 8 దేశాలు, రెండు గ్రూపులుగా పోటీ ప‌డ‌నున్నాయి. రెండు గ్రూల్లో టాప్‌-2 జ‌ట్లు సెమీస్ కు వెళ‌తాయి. సెమీ ఫైన‌ల్ లో గెలిచిన రెండు జ‌ట్లు ఫైన‌ల్ లో త‌ల‌ప‌డ‌తాయి. లీగ్ స్టేజీలో ప్ర‌తి జట్టు మూడు మ్యాచ్ లు ఆడుతుంది. టీమిండియా ఈ నెల 20, 23 తో పాటు మార్చి 1న త‌న లీగ్ మ్యాచ్ లు ఆడ‌నుంది. ఈ మ్యాచ్ ల్లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్ జ‌ట్ల‌తో రోహిత్ సేన త‌ల‌ప‌డ‌నుంది. 

More Telugu News