Karan Johar: రాజమౌళి సినిమాలకు అది అక్కర్లేదు.. కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

- రాజమౌళి సినిమాలకు లాజిక్ అవసరం లేదన్న కరణ్
- దర్శకుడికి తన కథపై విశ్వాసం ఉంటే హిట్ అవుతుందని వ్యాఖ్య
- ప్రేక్షకులకు నమ్మకం కలిగించేలా జక్కన్న సినిమాలను తెరకెక్కిస్తారని ప్రశంస
- గొప్ప చిత్రాలకు లాజిక్ తో పని లేదంటూ కితాబు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలపై బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తీసిన కొన్ని సినిమాలకు లాజిక్ అవసరం లేదన్నారు. కథపై పూర్తి విశ్వాసం ఉంచి ప్రేక్షకులకు నమ్మకం కలిగించేలా సినిమాలను జక్కన్న తెరకెక్కిస్తారని ప్రశంసించారు.
గొప్ప చిత్రాలకు లాజిక్ తో పని లేదన్నారు. కరణ్ జోహార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శర్మ రూపొందించిన ఆర్ఆర్ఆర్, యానిమల్, గదర్ వంటి సినిమాలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
"కొన్ని సినిమాలు లాజిక్ కంటే నమ్మకం ఆధారంగా హిట్ అవుతుంటాయి. సినిమాలపై నమ్మకం ఉంటే ప్రేక్షకులు లాజిక్ ను పట్టించుకోరు. ఈ విషయం గొప్ప దర్శకుల చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జక్కన్న తీసే సినిమాలనే తీసుకోండి... ఆయన సినిమాల్లోని లాజిక్ ల గురించి ప్రేక్షకులు ఎప్పుడూ మాట్లాడరు. ఆయనకు తన స్టోరీపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటాయి.
ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కించగలరు. ఆర్ఆర్ఆర్, యానిమల్, గదర్ ఇలాంటివాటికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇవి విజయవంతం కావడంలో ఆయా దర్శకులపై ఉన్న నమ్మకం కూడా ఒక కారణం. సినిమా విజయం పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. లాజిక్ ల గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం ఉండదు. సినిమాను కేవలం వినోదం కోసం మాత్రమే చూడాలి" అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు.