Vangalapudi Anitha: శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష

Home Minister Vangalapudi Anitha Review On Srikalahasti Temple Brahmotsavam

  • సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న మంత్రి అనిత
  • బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు
  • స్వామివారిని దర్శించుకున్న తర్వాత వీఐపీ పాసులు వెనక్కి తీసుకుంటామన్న మంత్రి అనిత

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ధూర్జటి కళా ప్రాంగణం, రాజగోపురాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో వేదిక ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు.

భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. శ్రీకాళహస్తికి వచ్చి స్వామిని దర్శించుకునే ఆడపడుచులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పసుపు కుంకుమలు ఇవ్వడం అభినందనీయమని మంత్రి అనిత అన్నారు. స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం పొందిన అనంతరం భక్తులు తమను (కూటమి ప్రభుత్వాన్ని) కూడా ఆశీర్వదించాలని కోరారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంబులెన్స్, ఫైర్, మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ వంటి అత్యవసర సేవలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అప్రమత్తంగా ఉంచాలని తెలిపారు. పోలీసులు, ఫైర్, ట్రాఫిక్ సిబ్బంది సహా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. సామాన్య భక్తులు సంతోషంగా స్వామిని దర్శించుకునే విధంగా ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీఐపీలు స్వామిని దర్శించుకున్న అనంతరం పాస్‌లను తిరిగి తీసుకుంటామని తెలిపారు. దీనివల్ల పునర్ దర్శనాలను నియంత్రించి ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు.

రథోత్సవం సందర్భంగా భోజనాల సమయంలో అందరూ పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి హోంమంత్రి అనిత వెళ్లారు. బొజ్జల కుటుంబ సభ్యుల ఆత్మీయ పలకరింపు, సత్కారాన్ని మరువలేనని అనిత పేర్కొన్నారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలసిన మహాశివుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కాణిపాకం వినాయకుడిని హోంమంత్రి దర్శించుకున్నారు. 

  • Loading...

More Telugu News