Indian Illegal Immigrants: అమెరికా మళ్లీ అదే తీరు.. సంకెళ్లతోనే భారతీయులు!

- శని, ఆదివారాల్లో భారత్‌కు చేరుకున్న 228 మంది వలసదారులు
- కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి తరలింపు
- ప్రయాణంలోనూ తొలగించలేదన్న బాధితులు
- వచ్చిన వారిలో ఇద్దరు హత్యకేసు నిందితులు
- విమానం ల్యాండైన వెంటనే అరెస్ట్
సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తమ సైనిక విమానాల్లో వెనక్కి పంపే విధానాన్ని అమెరికా మార్చుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోవడం లేదు. అక్రమంగా నివసిస్తున్నారనే కారణంతో కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి మరీ విమానాలు ఎక్కిస్తోంది. ప్రయాణం మొత్తం సంకెళ్లతోనే ఉంచినట్టు భారతీయ వలసదారులు వాపోయారు.
సరైన పత్రాలు లేవన్న కారణంగా మొత్తం 228 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది. వీరిని మోసుకొచ్చిన రెండు విమానాలు శని, ఆదివారాల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండయ్యాయి. విమానం దిగిన తర్వాతే తమకు వేసిన సంకెళ్లు, గొలుసులు తొలగించినట్టు తెలిపారు. కాగా, తొలి విడతలో ఈ నెల 5న 104 మంది భారతీయులను వెనక్కి పంపినప్పుడు కూడా అమెరికా ఇలాగే సంకెళ్లు వేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక, శనివారం వచ్చిన విమానంలో 116 మంది, ఆదివారం వచ్చిన విమానంలో 112 మంది ఉన్నారు. శనివారం రాత్రి భారత్ చేరుకున్న వలసదారుల వివరాలను పరిశీలించిన అనంతరం ఆదివారం సాయంత్రం వారిని ఇళ్లకు పంపారు. ఆదివారం భారత్ చేరుకున్న వారి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
రెండో విడతలో అమెరికా నుంచి వచ్చిన వారిలో ఇద్దరు యువకులు హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. పంజాబ్‌లోని పటియాలా జిల్లా రాజ్‌పురాకు చెందిన సందీప్ సింగ్ అలియాస్ సన్నీ, ప్రదీప్ సింగ్‌లను విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో వారిపై హత్య కేసు నమోదైంది.