KTR: మీరా అప్పుల గురించి మాట్లాడేది?: నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ

- పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు రాష్ట్రమేనని కేటీఆర్ వెల్లడి
- అప్పులు చేసినా ప్రజల కష్టాలు తీర్చామని వివరణ
- ప్రతి బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని స్పష్టం చేశారు. మేం చేసిన అప్పులతో తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చాం... తెలంగాణ దశ దిశను మార్చాం... తెలంగాణకు తరగని ఆస్తులు సృష్టించాం అని వెల్లడించారు.
దేశ చరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసిన మీరా మాపై అభాండాలు మోపేది? మీ అప్పులన్నీ కార్పొరేట్ శక్తుల రుణాల మాఫీ కోసమే అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రతి బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారు... బీజేపీని తెలంగాణ ప్రజలు క్షమించరు అని స్పష్టం చేశారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేళ్లలో తీసుకువచ్చిన రూ.125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో రూ.56 లక్షల కోట్లతో అప్పులు చేస్తే... పదేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం రూ.125 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. అప్పులపై మాట్లాడే హక్కు బీజేపీ ప్రభుత్వానికి లేదని తన లేఖలో పేర్కొన్నారు.