KTR: నదీ జలాలను ఏపీ తన్నుకుపోతుంటే రేవంత్ సర్కారులో చలనం లేదు: కేటీఆర్

- ఏపీ రోజుకు 10 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుపోతోందన్న కేటీఆర్
- మూడు నెలలుగా తరలించుకుపోతోందని ఆరోపణ
- కాంగ్రెస్ సర్కారు అడ్డుకోవడంలేదని ఆగ్రహం
తెలంగాణకు దక్కాల్సిన నదీ జలాలను ఏపీ తన్నుకుపోతుంటే రేవంత్ రెడ్డి సర్కారులో చలనం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా రోజుకు 10 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ తరలించుకుపోతోందని ఆరోపించారు. గత మూడు నెలలుగా ఈ తంతు జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చూస్తోందని కేటీఆర్ విమర్శించారు.
నాడు కేసీఆర్ గోదావరి, కృష్ణా జలాల్లో ప్రతి బొట్టును కూపాడుకుంటూ బీడు భూములను సస్యశ్యామలంగా మార్చారని... కానీ కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలోనే పంట పలాలను బీడుగా మార్చేసిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపదికన తెలంగాణ ఏర్పడిందని... అలాంటి రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అన్నింటినీ రేవంత్ సర్కారు నాశనం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణా జలాల నుంచి 646 టీఎంసీల నీటిని వినియోగించుకున్నా, కాంగ్రెస్ సర్కారు అడ్డుకోవడంలేదని ఆగ్రహం వెలిబుచ్చారు.