Vizag Steel Plant: ఉక్కు పరిశ్రమల క్రికెట్ టోర్నీ విజేతగా వైజాగ్ స్టీల్ ప్లాంట్... అభినందనలు తెలిపిన సీబీఐ మాజీ జేడీ

- దేశంలోని ఉక్కు పరిశ్రమల మధ్య క్రికెట్ టోర్నీ
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఛాంపియన్ గా నిలవడం పట్ల లక్ష్మీనారాయణ స్పందన
- ఇదే స్ఫూర్తిని స్టీల్ ప్లాంట్ పునర్వైభవం కోసం ఉపయోగించాలని సూచన
దేశంలోని ఉక్కు పరిశ్రమలకు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విజేతగా నిలిచింది. ఇంటర్ స్టీల్ ప్లాంట్స్ క్రికెట్ టోర్నీ ఫైనల్ విశాఖ స్టీల్ ప్లాంట్ జట్టు 5 వికెట్ల తేడాతో సేలం స్టీల్ ప్లాంట్ టీమ్ ను ఓడించింది.
బొకారోలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సేలం స్టీల్ ప్లాంట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. అనంతరం, 129 పరుగుల లక్ష్యాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ జట్టు కేవలం 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది.
దీనిపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. టీ20 ఇంటర్ స్టీల్ ప్లాంట్స్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్రికెట్ జట్టుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
"ఈ ఘనవిజయం వారి అంకితభావానికి, సమష్టి కృషికి, గెలుపు స్ఫూర్తికి నిదర్శనం. ఇదే పట్టుదల, దృఢసంకల్పంతో... క్రికెట్ టీమ్ అందించిన ఉత్తేజాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ, ఎగ్జిక్యూటివ్ అధికారులు, కార్మికులు పరిశ్రమ పునర్వైభవం కోసం ఉపయోగించాలి. అందివచ్చిన అవకాశాన్ని సంఘటిత శక్తితో, అకుంఠిత దీక్షతో, వ్యూహాత్మక ప్రణాళికతో సద్వినియోగం చేసుకుంటే విజయవంతమైన ఫలితాలు సాధించవచ్చు. ఈ సందర్భంగా యావత్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.