Sugar: ఏ వయసు వారు... రోజుకు ఎంత షుగర్​ తీసుకోవచ్చు!

how much sugar should you consume daily as per your age

  • అన్ని పోషక పదార్థాల తరహాలోనే చక్కెర కూడా మనకు శక్తిని ఇచ్చేదే...
  • కానీ మనకు చక్కెర తీసుకోవాల్సిన అవసరం తక్కువే...
  • వయసును బట్టి ఎంత చక్కెర తీసుకోవాలనే దానిపై నిపుణులు చేస్తున్న సూచనలు ఇవిగో...

స్వీట్లను చూసినా, తీపి పదార్థాలు ఏవి మన ముందున్నా నోరూరడం ఖాయం. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరికీ తీపి అంటే ఇష్టమే. మనం టీలో కలిపి తాగే చక్కెర దగ్గరి నుంచి స్వీట్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, కొన్ని రకాల ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లలో చక్కెర ఉంటుంది. అయితే ఎవరైనా సరే రోజులో చక్కెర తీసుకోవడానికి ఓ పరిమితి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పరిమితికి మించి చక్కెర తీసుకుంటూ పోతే... శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటివి తలెత్తి చివరికి గుండె జబ్బులకూ దారితీస్తాయని స్పష్టం చేస్తున్నారు.

ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కెర తీసుకోవచ్చు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం... వేర్వేరు వయసుల వారు వేర్వేరు స్థాయిల్లో చక్కెరను తీసుకోవచ్చు. అది కూడా టీ, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, చాక్లెట్లు... ఇలా అన్ని రూపాల్లో కలిపి లెక్కించాలన్న మాట. మరి ఎవరెవరు రోజుకు ఎంతెంత చక్కెర తీసుకోవచ్చంటే...
  • 18 ఏళ్లు పైబడిన వారు: 50 గ్రాములు
  • 11 నుంచి 18  ఏళ్ల మధ్య వయసు వారు: 25 గ్రాములు
  • 7 నుంచి 10 ఏళ్ల మధ్య పిల్లలు: 25 గ్రాములు
  • 4 నుంచి 6 ఏళ్ల మధ్య పిల్లలు: 15 గ్రాములు
  • 1 నుంచి మూడేళ్ల మధ్య చిన్నారులు: 12.5 గ్రాములు
  • ఈ చక్కెర పరిమితులన్నీ పూర్తి ఆరోగ్యంతో ఉన్న సాధారణ వ్యక్తులకు మాత్రమే. ఏవైనా అనారోగ్యాలు ఉన్నవారు, మధుమేహం, గుండె జబ్బులు వంటివాటితో బాధపడుతున్నవారు చక్కెర పదార్థాలను బాగా తగ్గించడమో, లేదా అసలు తీసుకోకపోవడమో చేయాల్సి ఉంటుంది.

ఒక్కసారిగా, అతిగా తీసుకుంటే ప్రమాదకరం...
పరిమితి లోపు చక్కెర తీసుకున్నా కూడా ఒక్కసారిగా తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చక్కెర చాలా వేగంగా జీర్ణమై... రక్తంలో గ్లూకోజ్ స్థాయులు చాలా వేగంగా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. దీనితో శరీరంలో వేగంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయి... గ్లూకోజ్ స్థాయులను తగ్గిస్తుందని, ఇలా వేగంగా చక్కెర స్థాయులు తగ్గిపోతాయని వివరిస్తున్నారు. ఇలా ఒక్కసారిగా హెచ్చుతగ్గులు ఏర్పడటం శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపిస్తుందని, తరచూ ఇలా జరిగితే సమస్యలు మొదలవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పండ్లలో ఉండే షుగర్ తో కొంత మేలు 
మామూలుగా పండ్లలోనూ షుగర్ ఉంటుంది. మనం వాడే సాధారణ చక్కెరలతో పోలిస్తే... పండ్లలోని చక్కెరలతో శరీరానికి ప్రమాదం తక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ అంశాలను గుర్తుంచుకోండి...
మనం తినే ఆహారంలో చాలా వాటిలో ఏదో ఓ రూపంలో చక్కెర పదార్థాలు ఉంటాయని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు... ఈ పరిమితి కన్నా తక్కువ చక్కెర తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు చక్కెర పదార్థాలను వినియోగించడం మంచిదని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News