Virat Kohli: పాక్ లో కోహ్లీ క్రేజ్ మామూలుగా లేదు.. వీడియో ఇదిగో!

- కరాచీ స్టేడియం ముందు ఫ్యాన్స్ రచ్చ
- కోహ్లీ జిందాబాద్.. ఆర్సీబీ ఆర్సీబీ అంటూ నినాదాలు
- ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవ వేడుకలలో ఘటన
విరాట్ కోహ్లీకి మన దేశంలోనే కాదు పొరుగుదేశం పాకిస్థాన్ లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పాక్ యువతలో కోహ్లీకి ఎంతగా ఫాలోయింగ్ ఉందో చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవ వేడుకలను పాక్ క్రికెట్ బోర్డ్ కరాచీ స్టేడియంలో నిర్వహించింది. ఈ వేడుకలకు యువత పెద్ద సంఖ్యలో హాజరయింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారిని ఓ మీడియా ప్రతినిధి పలకరించాడు.
'మీరు బాబర్ కోసం వచ్చారా.. కోహ్లీ కోసం వచ్చారా' అని అడగగా చాలామంది విరాట్ కోహ్లీ పేరు చెప్పారు. మరికొంతమంది బాబర్ అని చెప్పుకొచ్చారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. తన పేరు కరణ్ అని, అయితే స్నేహితులు తనను కోహ్లీ అని పిలుస్తారని చెప్పాడు. విరాట్ కోహ్లీకి తాను వీరాభిమానినని తెలిపాడు. విరాట్ కోహ్లీ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ తన అభిమానం చాటుకున్నాడు. దీంతో అక్కడున్న మిగతా వారు కూడా కోహ్లీ జిందాబాద్, ఆర్సీబీ ఆర్సీబీ అంటూ నినాదాలు చేశారు. కాగా, పాకిస్థాన్ వేదికగా మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికగా మ్యాచ్ లు జరగనున్నాయి.