Illegal Indian Immigrants: భారత అక్రమ వలసదారులతో అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన అమెరికా విమానం.. దారిలో మరో విమానం!

- 116 మందితో వచ్చిన అమెరికా మిలటరీ విమానం
- 157 మందితో వస్తున్న మరో విమానం
- ఇమిగ్రేషన్ చెక్, ఇతర లాంఛనాలు పూర్తయ్యాక వారిని ఇంటికి పంపే అవకాశం
116 మంది భారత అక్రమ వలసదారులను మోసుకొచ్చిన అమెరికా మిలటరీ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. భారత అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించడం ఇది రెండోసారి. ఈ నెల 5న 104 మందితో వచ్చిన విమానం కూడా ఇదే విమానాశ్రయంలో దిగింది.
తాజాగా భారతీయులతో వచ్చిన ఏసీ-17 విమానం గత రాత్రి 90 నిమిషాలు ఆలస్యంగా 11.35 గంటలకు ల్యాండ్ అయింది. ఇమిగ్రేషన్, వెరిఫికేషన్ సహా లాంఛనాలు పూర్తయిన తర్వాత వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇక, వచ్చిన 116 మందిలో 60 మందికిపైగా పంజాబ్‌కు చెందిన వారే ఉండటం గమనార్హం. 30 మందికిపైగా హర్యానాకు చెందినవారు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ కు చెందినవారు ఇద్దరేసి చొప్పున ఉండగా, జమ్మూ, కశ్మీర్‌కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు.
ఇక, 157 మందితో కూడిన మరో విమానం నేడు రానుంది. వీరిలో 59 మంది హర్యానాకు చెందిన వారు కాగా, పంజాబ్‌కు చెందిన వారు 52 మంది, గుజరాత్‌కు చెందినవారు 31 మంది ఉన్నారు. అలాగే, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయులను అమెరికా గుర్తించిందని, వారు త్వరలోనే భారత్‌కు చేరుకుంటారని భారత ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.