YS Sharmila: ఇద్దరూ కలిసి రాష్ట్ర రైతులను నిండా ముంచారు: షర్మిల

Sharmila slams Chandrababu and Jagan

  • రైతుల ఆత్మహత్యల్లో ఏపీది మూడోస్థానం అని షర్మిల వ్యాఖ్యలు
  • రైతులు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్నారని వెల్లడి
  • చంద్రబాబు, జగన్ ధరల స్థిరీకరణ నిధి పేరిట మోసం చేశారని విమర్శలు

"లక్షల్లో అప్పులు... రోజుకో ఆత్మహత్య... రైతుల బలవన్మరణాల్లో మూడో స్థానం... ఇదీ మన రాష్ట్రంలో రైతుల దీనస్థితి" అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడంలేదని విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం అన్నపూర్ణగా పేరొందిందని... పంట దిగుబడుల్లో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన రైతులు ప్రస్తుతం గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్నారని షర్మిల విచారం వ్యక్తం చేశారు. 

"గత పదేళ్లుగా రైతులకు ప్రభుత్వాలు మాయమాటలు చెబుతూనే ఉన్నాయి. చంద్రబాబు మొదటి ఐదేళ్లు ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని మాట తప్పారు. ఆ తర్వాత జగన్ ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారు. ఇద్దరూ కలిసి రాష్ట్ర రైతులను నిండా ముంచారు. ధరల స్థిరీకరణ పేరుతో రాజకీయాలు చేశారే తప్ప... రైతుకు రూపాయి ఇచ్చింది లేదు. 

రాష్ట్రంలో వరి ధాన్యానికి బస్తాకు రూ.1,400 మించి ధర పలకడం లేదు... పత్తి ధర రూ.12 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయింది. మిర్చి రూ.23 వేలు అందాల్సిన చోట రూ.11 వేల కంటే ఎక్కువ ధర అందడంలేదు. కంది రూ.10 వేల నుంచి రూ.7 వేలకు పడిపోయింది. 

రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని తక్షణమే ఏర్పాటు చేయండి... గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. అన్నదాత సుఖీభవ పథకంలో ఇస్తామని చెప్పిన రూ.20 వేల సాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం" అని షర్మిల పేర్కొన్నారు.

YS Sharmila
Chandrababu
Jagan
Farmers
Congress
TDP
YSRCP
  • Loading...

More Telugu News