Kumbh Mela: ముగింపు దశకు మహా కుంభమేళా... యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్ యాదవ్ కీలక సూచన

- కుంభమేళాకు తరలి వస్తున్న భక్తకోటి
- కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలన్న అఖిలేశ్ యాదవ్
- గతంలో మహా కుంభమేళా 75 రోజులు ఉండేదన్న మాజీ ముఖ్యమంత్రి
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక సూచన చేశారు. కుంభమేళాను పొడిగించాలన్నారు.
మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. నిన్న సాయంత్రానికి 50 కోట్ల మంది భక్తులకు పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తెలిపింది. కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభమేళాకు హాజరయ్యేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని తెలిపారు.
కుంభమేళా ఈ నెల 26తో ముగియనుందని, దీనిని మరికొన్ని రోజుల పాటు కొనసాగిస్తే బాగుంటుందని అఖిలేశ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే అందరూ పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
గతంలో మహా కుంభమేళా 75 రోజుల పాటు కొనసాగేదని, ఈసారి తగ్గించారని అన్నారు. చాలామంది కుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించాలని కోరుకుంటారని, కానీ వ్యవధి తక్కువగా ఉండటంతో అందరికీ సాధ్యం కావడం లేదని అన్నారు. అందుకే మరిన్ని రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.