Ind Vs Pak: భారత ఆటగాళ్లకు హగ్ ఇవ్వడం లాంటివి చేయకండి... పాక్ ప్లేయర్లకు ఫ్యాన్స్ సందేశం!

- మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025
- పాక్, దుబాయ్ వేదికలలో ఈసారి టోర్నమెంట్
- పాక్ వెళ్లేందుకు భారత్ ససేమిరా.. హైబ్రిడ్ మోడ్లో టోర్నీ
- దుబాయ్ వేదికగా టీమిండియా మ్యాచ్ లు
- ఈ నేపథ్యంలో తమ జట్టు ప్లేయర్లకు పాక్ అభిమానుల కీలక సందేశం
మరో నాలుగు రోజుల్లో ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి తెర లేవనుంది. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం పోరాడనున్నాయి. పాక్, దుబాయ్ వేదికలలో ఈసారి టోర్నమెంట్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక టోర్నీలో భాగంగా హైవోల్టేజీ మ్యాచ్ అయిన దాయాదుల పోరు ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది.
అయితే, ఈసారి పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి భారత జట్టును ఆ దేశానికి పంపించడానికి బీసీసీఐ అంగీకరించకపోవడంతో టోర్నమెంట్ హైబ్రిడ్ మోడ్ లో జరగుతున్న సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా తన మ్యాచ్ లను దుబాయ్ వేదికగా ఆడనుంది.
ఈ నేపథ్యంలో భారత జట్టుపై గుర్రుగా ఉన్న పాకిస్థాన్ అభిమానులు తమ జట్టు ఆటగాళ్లకు తాజాగా కీలక సూచనలు చేశారు. మ్యాచ్ జరిగే సమయంలో ఎట్టిపరిస్థితుల్లో టీమిండియా ప్లేయర్లతో పాక్ ఆటగాళ్లు కరచాలనం చేయడం, హగ్ ఇవ్వడం లాంటివి చేకూడదని అంటున్నారు. కెప్టెన్ రిజ్వాన్ తో సహా ప్లేయర్లందరూ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లను కౌగిలించుకోవడం, స్నేహపూర్వకంగా మాట్లాడటం చేయరాదని తెలిపారు.
మన దగ్గర ఆడటానికి వారు సుముఖంగా లేనప్పుడు, వారితో మనకు స్నేహం అక్కర్లేదు... ప్రత్యర్థిగానే చూడాలి... వారిపై గెలిచి మనమెంటో చూపించాలి అని సూచించారు. ఓ అభిమాని అయితే, ఈసారి భారత జట్టు బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోవాలని తాము కోరుకుంటామని రోహిత్ సేనపై అసహనం వ్యక్తం చేశాడు.
కాగా, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాక్ చేతిలోనే భారత్ కు పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా వరుసగా రెండోసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. 2013లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.