Health: మిల్క్ చాక్లెట్ Vs డార్క్ చాక్లెట్... పిల్లలకు ఏది మంచిది?

- మనకు అందుబాటులో రెండు రకాల చాక్లెట్లు
- పాలతో తయారు చేసే మిల్క్ చాక్లెట్ ను ఇష్టపడేవారు కొందరు
- డార్క్ చాక్లెట్ ను ఇష్టంగా తినేవారు మరికొందరు
చాక్లెట్ అంటే ఇష్టపడనివారు ఉండరు. పిల్లలు, పెద్దవాళ్లు అనే తేడా లేదు. ఎవరికైనా సరే చాక్లెట్ ను చూస్తే నోరు ఊరుతుంది. చాక్లెట్లలో బేసిక్ గా రెండు రకాలు.. ఒకటి మిల్క్ చాక్లెట్, రెండోది డార్క్ చాక్లెట్. ఈ రెండింటికి సంబంధించి వేర్వేరు రుచి, ప్రయోజనాలు ఉంటాయి. మరి మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్... ఈ రెండింటిలో పిల్లలకు ఏది మంచిదో తెలుసా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా...
మిల్క్ చాక్లెట్...
మిల్క్ చాక్లెట్ ను పాల నుంచి తీసిన పదార్థాలతో తయారు చేస్తారు. ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయని, అవి శరీరంలో నాడుల పనితీరును మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మిల్క్ చాక్లెట్ శరీరంలో రక్తపోటును తగ్గిస్తుందని వివరిస్తున్నారు. మూడీగా ఉన్నవారు చురుకుగా మారేందుకు కూడా ఇది తోడ్పడుతుందని పేర్కొంటున్నారు.
డార్క్ చాక్లెట్...
డార్క్ చాక్లెట్ ముఖ్యంగా కోకోవా గింజల నుంచి తీసిన పదార్థంతో తయారు చేస్తారు. ఇందులో పాలిఫెనాల్స్ గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఉంటాయని... అవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తాయని వివరిస్తున్నారు. శరీరంలో కణాలు దెబ్బతినకుండా పాలిఫెనాల్స్ రక్షిస్తాయని పేర్కొంటున్నారు.
రెండింటిలో పిల్లలకు ఏది మంచిది?
- మిల్క్ చాక్లెట్లతో పోలిస్తే... డార్క్ చాక్లెట్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
- పిల్లల్లో మెదడు ఆరోగ్యంగా పనిచేయడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడానికి డార్క్ చాక్లెట్లలోని పదార్థాలు తోడ్పడతాయని వివరిస్తున్నారు.
- డార్క్ చాక్లెట్లలోని కొన్ని రసాయన సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచడానికి కూడా తోడ్పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
- ఇక డార్క్ చాక్లెట్లతో పోలిస్తే... మిల్క్ చాక్లెట్లలో చక్కెర ఎక్కువగా ఉంటుందని, ఇది కొంత వరకు ఫర్వాలేదని, పరిమితికి మించితే ఇబ్బందులు రావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- పిల్లల విషయానికి వస్తే... మిల్క్ చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెట్లు మంచివని, చక్కెర తక్కువ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ప్రయోజనకరమని నిపుణులు వివరిస్తున్నారు.
- కేవలం డార్క్ చాక్లెట్ మాత్రమే ఇవ్వకుండా.. వాటిని అరటిపండు, స్ట్రాబెర్రీ ముక్కలతో కలిపి ఇస్తే ఆరోగ్యానికి కూడా మంచిదని సూచిస్తున్నారు.
ఈ అంశాలను గుర్తుంచుకోండి...
ఇటీవల చాక్లెట్ కంపెనీలు ఏవైనా... డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ రెండింటి లోనూ అధిక మొత్తంలో చక్కెరను కలిపి తయారు చేస్తున్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందువల్ల చక్కెర శాతం తక్కువగా ఉన్నవాటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అతి తక్కువ చక్కెర శాతం ఉన్న డార్క్ చాక్లెట్లు అటు పిల్లలకు, ఇటు పెద్ద వారికి కూడా మంచివేనని స్పష్టం చేస్తున్నారు.