Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీతో పంకజశ్రీ ములాఖత్.. జైల్లో తన భర్తకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన

- తన భర్తను నేలపై పడుకోబెట్టారన్న పంకజశ్రీ
- వంశీని మెంటల్ గా టార్చర్ చేస్తున్నారని మండిపాటు
- వంశీని కలుస్తానని జగన్ చెప్పారని వెల్లడి
విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజశ్రీ కలిశారు. ఈరోజు తన భర్తతో ఆమె ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ... సబ్ జైల్లో తన భర్త వంశీ ప్రాణాలకు హాని ఉందని అన్నారు. తన భర్తను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వంశీపై తప్పుడు కేసు పెట్టారని, ఆయన రిమాండ్ లో మాత్రమే ఉన్నారని, ఆయనపై కేసులు ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. ఆయనపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలేనని అన్నారు.
వంశీ వెన్ను నొప్పి, శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారని... ఆయనను నేలమీద పడుకోబెట్టారని పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. బెడ్ కావాలని కోరుతామని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న వంశీని... మెంటల్ గా టార్చర్ చేస్తున్నారని అన్నారు. వంశీ ఆరోగ్యం బాగుందని వైద్యులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కోర్టుకు వెళతామని చెప్పారు.
వైసీపీ అధినేత జగన్ తనకు ఫోన్ చేసి, ధైర్యం చెప్పారని తెలిపారు. వంశీని కలుస్తానని జగన్ చెప్పారని వెల్లడించారు. తమకు వైసీపీ అండగా ఉందని... లీగల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. సత్యవర్ధన్ ను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని పంకజశ్రీ ప్రశ్నించారు.