Vallabhaneni Vamsi: మంచం కావాలన్న వల్లభనేని వంశీ... కుదరదన్న జైలు అధికారులు

- విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న వల్లభనేని వంశీ
- నడుము నొప్పి ఉందని, మంచం కావాలని డిమాండ్
- ఏ సదుపాయం కావాలన్నా కోర్టులో పిటిషన్ వేసుకోవాలన్న జైలు అధికారులు
కిడ్నాప్, బెదిరింపుల కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు జైల్లో వల్లభనేని వంశీ రచ్చ చేస్తున్నారు.
తనకు నడుం నొప్పి ఉందని, తనకు మంచం కావాలని జైల్లో వంశీ పట్టుబట్టారు. ఈ విషయంపై జైలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా తెలిపారు. ఆయనను పరిశీలించిన జైలు వైద్యులు మంచం అవసరం లేదని చెప్పారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఉన్నా వైద్యులకు చూపిస్తామని జైలు అధికారులు వంశీకి తెలిపారు. ఏ సదుపాయం కావాలన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించారు.
అంతకుముందు కోర్టు హాల్లో కూడా వంశీ శాపనార్థాలు పెట్టారు. తనపై కేసు పెట్టిన వారు మట్టి కొట్టుకుపోతారని అన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించే సమయంలో కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులు తెలిపారు. తనపై కేసు పెట్టించిన వారు ఎవరో తనకు తెలుసని... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి తేలుస్తానని హెచ్చరించారు.