Balakrishna: తమన్ కు బాలయ్య ఖరీదైన గిఫ్ట్

- ఖరీదైన పోర్షే కారును తమన్ కు బహుమతిగా ఇచ్చిన బాలయ్య
- తమన్ తనకు తమ్ముడితో సమానం అన్న సీనియర్ హీరో
- వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు గిఫ్ట్ గా ఇచ్చానన్న బాలకృష్ణ
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కాంబోకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'డిక్టేటర్', 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. బాలయ్య సినిమాకు తమన్ ఇచ్చే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. థియేటర్లలో సౌండ్ బాక్స్ లు బద్దలు అవ్వాల్సిందే. సినిమాతో పాటు వ్యక్తిగతంగా కూడా బాలకృష్ణ, తమన్ ల మధ్య మంచి రిలేషన్ ఉంది.
ఇక తాజాగా తమన్ కు బాలకృష్ణ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు బాలయ్య. అలాగే కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని యువ సంగీత దర్శకుడిని ఆశీర్వదించారు. తమన్ కు బాలకృష్ణ కారు బహుమతిగా ఇస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో తమన్ గురించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "తమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు గిఫ్ట్ గా ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది" అని అన్నారు.
ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2' చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కూడా తమన్ నే బాణీలు అందిస్తున్నారు. అఖండ 2కి కూడా థియేటర్లలో సౌండ్ బాక్స్ లు బద్దలు అవుతాయని ఇప్పటికే ఓ సందర్భంలో తమన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.