Instagram: ఇన్ స్టాలో కొత్త ఫీచర్.. ఎవరు అడిగారయ్యా మిమ్మల్ని అంటున్న నెటిజన్లు

Internet Reacts To Instagrams New Dislike Button For Comments

  • డిజ్ లైక్ బటన్ ను తీసుకొస్తున్న ఇన్ స్టా
  • ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నామని కంపెనీ వెల్లడి
  • సైబర్ వేధింపులను మరో లెవల్ కు తీసుకెళుతుందని నెటిజన్ల ఆందోళన

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఇన్ స్టాగ్రామ్’ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఖాతాదారులు తమ పోస్టులకు వచ్చే నెగెటివ్ కామెంట్లను డిజ్ లైక్ చేసే అవకాశాన్ని ‘డౌన్ యారో’ గుర్తుతో కల్పిస్తోంది. ప్రతీ కామెంట్ కు లైక్ బటన్ పక్కనే ఈ డౌన్ యారో గుర్తు ఉంటుంది. సంబంధిత కామెంట్ నచ్చకుంటే ఈ డిజ్ లైక్ బటన్ నొక్కడం ద్వారా సున్నితంగా ఆ విషయాన్ని చెప్పొచ్చని వివరించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని కంపెనీ పేర్కొంది.

అయితే, నెటిజన్లు మాత్రం ఈ డిజ్ లైక్ బటన్ ఎందుకు తీసుకొస్తున్నట్లు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఎవరు అడిగారని, ఏం ఉపయోగం ఉందని ఈ ఫీచర్ తెస్తున్నారంటూ కామెంట్లతో నిలదీస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వేధింపులు పెరిగాయని, యువత, చిన్నపిల్లలు నెగెటివిటీ కారణంగా మానసికంగా కుంగిపోతున్నారని చెబుతున్నారు. తాజా బటన్ తో సైబర్ వేధింపులను ఇన్ స్టా మరో లెవల్ కు తీసుకెళుతుందని కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఖాతాదారులు తమకు తోచిన పోస్టు పెట్టుకుంటే అది నచ్చని వాళ్లు స్క్రోల్ చేసుకుంటూ మరో పోస్టును చూస్తారని చెప్పారు. కానీ, ‘మీ పోస్టు నాకు నచ్చలేదు’ అని ప్రత్యేకంగా చెప్పేందుకు ఈ డిజ్ లైక్ ఆప్షన్ వీలుకల్పిస్తుందని, దీనివల్ల సదరు పోస్టు పెట్టిన వారు నొచ్చుకుంటారని అన్నారు.

పెద్ద మొత్తంలో డిజ్ లైక్ లు వస్తే మానసికంగా ఇబ్బందులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ పోస్టులకు పెద్ద సంఖ్యలో లైక్ లు రావాలనే కోరికతో యువత ఇబ్బందికరమైన, సాహసోపేతమైన పనులు చేస్తోందని గుర్తుచేస్తున్నారు. అయితే, ఇన్ స్టా ప్రతినిధులు మాత్రం తమ ఖాతాదారులను సైబర్ బుల్లీయింగ్ నుంచి కాపాడడానికే ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరణ ఇచ్చారు. త్వరలో అందుబాటులోకి రానున్న డిజ్ లైక్ ఆప్షన్ తో నచ్చని కామెంట్లకు ప్రతిస్పందించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి నెగెటివ్ కామెంట్లను మిగతా కామెంట్లకు చివర్లోకి పంపించే వెసులుబాటు కల్పిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News