Madhya Pradesh High Court: భార్య వేరొకరిని ప్రేమించడం తప్పుకాదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు

Wifes love for another man not adultery says Madhya Pradesh high court

  • భర్త కాకుండా మరో వ్యక్తిపై ప్రేమ, అనురాగం పెంచుకోవడం నేరం కాదన్న హైకోర్టు
  • శారీరక సంబంధం లేనంత వరకు వివాహేతర సంబంధంగా పరిగణించకూడదన్న న్యాయస్థానం
  • భరణం చెల్లించాల్సిందేనని స్పష్టీకరణ

భర్త కాకుండా మరో వ్యక్తి పట్ల భార్య ప్రేమ, అనురాగం ప్రదర్శించడం నేరం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం లేనంత వరకు దానిని వ్యభిచారంగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, కాబట్టి ఆమె మనోవర్తికి అనర్హురాలన్న భర్త వాదనను జస్టిస్ జీఎస్ అహ్లూవాలియా కొట్టిపడేశారు.

ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు రుజువైతే తప్ప మనోవర్తి, పోషణ భత్యం చెల్లించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. విడిగా ఉంటున్న భార్యకు మధ్యంతర భరణంగా నెలకు రూ. 4 వేలు చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 

‘‘ఎటువంటి శారీరక సంబంధం లేకుండా భార్య వేరొకరిపట్ల ప్రేమ, ఆప్యాయత కనబరుస్తుంటే, ఆమె వ్యభిచారం చేస్తున్నట్టు నిర్ధారించలేం’’ అని కోర్టు స్పష్టం చేసింది. భర్తకు అతి తక్కువ ఆదాయం వస్తుందన్న కారణంతో భరణాన్ని తిరస్కరించడం సరికాదని పేర్కొంది. తన రోజువారీ అవసరాలను కూడా తీర్చుకోలేనని తెలిసీ వివాహం చేసుకున్నట్టయితే అందుకు అతడే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. అతడు సమర్థుడైతే తన భార్యను పోషించుకోవడానికి, లేదా ఆమెకు ఎంతోకొంత చెల్లించేందుకు సంపాదిస్తాడని న్యాయస్థానం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News