YS Sharmila: ఈ దాడితో లబ్ధి పొందింది ఎవరు?... బీజేపీ నుంచి ఇప్పటికీ సమాధానం లేదు: షర్మిల

- పుల్వామా ఘటనకు నేటితో ఆరేళ్లు
- అమర జవాన్లకు నివాళులు అర్పించిన షర్మిల
- పుల్వామా ఘటనపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము కేంద్రానికి లేదని విమర్శలు
ఆరేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున (2019 ఫిబ్రవరి 14) పుల్వామాలో ఉగ్రదాడి జరిగి 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందడం తెలిసిందే. నేడు దేశవ్యాప్తంగా పుల్వామా అమరవీరులకు సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దీనిపై స్పందించారు.
2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది జవాన్లకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. ఆ జవాన్ల త్యాగాన్ని ఈ దేశం ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు.
"దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే. ఈ దుర్ఘటన జరిగి ఆరేళ్లు అవుతోంది. ఈ దాడితో ఎక్కువగా లబ్ధి పొందింది ఎవరు? దాడులకు సంబంధించి విచారణలో ఏం తేలింది? భద్రత వైఫల్యం పట్ల ఎవరు బాధ్యత తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అడిగిన ఈ ప్రశ్నలకు బీజేపీ నుంచి ఇప్పటికీ సమాధానం లేదు. పుల్వామా దాడిపై శ్వేతపత్రం అడిగితే విడుదల చేసే దమ్ము కేంద్రానికి లేదు" అని షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.