Chinthamaneni Prabhakar: ఈరోజు వంశీ లోపలకు వెళ్లాడు... రేపు కొడాలి నాని వెళతాడు: చింతమనేని ప్రభాకర్

- చేసిన తప్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న చింతమనేని
- ఆంబోతులా రంకెలు వేయొద్దని అంబటికి హితవు
- అబ్బయ్య చౌదరి కావాలనే తనతో గొడవ పెట్టుకున్నాడని మండిపాటు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు వంశీ లోపలకు వెళ్లాడని, రేపు కొడాలి నాని వెళతాడని, ఎల్లుండి మరో నేత వెళతాడని అన్నారు. గన్నవరంతో పాటు గుడివాడ, మచిలీపట్నం ఇలా అనేక నియోజకవర్గాల్లో తప్పులు చేశారని... వారి సంగతి ఎప్పుడు తేలుస్తారని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు.
వంశీ తప్పు చేయకుండానే గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం అయిందా? అని చింతమనేని ప్రశ్నించారు. కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ... చేసిన తప్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. కక్ష సాధింపులు, అధికార దుర్వినియోగం వైసీపీ నేతలకే సాధ్యమని చెప్పారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు పగటిపూట రాంబాబు అని... రాత్రిళ్లు కాంబాబు అని విమర్శించారు. గంటా, అరగంటా అంటూ మాట్లాడే అంబటి తన గురించి సర్టిఫికెట్ ఇస్తాడా? అని మండిపడ్డారు. ఆంబోతులా రంకెలు వేయడం మానుకోవాలని హితవు పలికారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేరుకే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని... మనిషి మటుకు హార్డ్ వేర్ అని అన్నారు. కావాలనే తనతో గొడవ పెట్టుకున్నాడని మండిపడ్డారు.
కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులతో మాట్లాడతానని... ఆయన చావుకు కారణమైన వారిపై చర్యలకు కేసు పెడతానని చెప్పారు. కోడెల చావుకు కారణమైన జగన్, అంబటిలపై ఇప్పటికైనా 306 సెక్షన్ కింద కేసు పెట్టాలని అన్నారు.