Nara Lokesh: రాకేష్ చౌదరి మృతిచెందడం నన్ను కలచి వేసింది: మంత్రి నారా లోకేశ్

- తిరుపతి జిల్లాలో ఇటీవల ఏనుగుల దాడి
- మృతి చెందిన కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి
- ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న లోకేశ్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ఇటీవల ఏనుగుల దాడిలో మృతి చెందడం తెలిసిందే. రాకేష్ చౌదరి కుటుంబ సభ్యులు ఇవాళ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. దీనిపై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రాకేష్ చౌదరి ఏనుగుల దాడిలో మృతి చెందడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.
"ఏనుగుల దాడిలో మరణించిన కందులవారిపల్లె డిప్యూటీ సర్పంచి రాకేష్ చౌదరి కుటుంబ సభ్యులు ఉండవల్లి నివాసంలో నన్ను కలిశారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాకేష్ చౌదరి మృతి చెందడం నన్ను కలచివేసింది.
రాకేష్ చౌదరి మృతి పార్టీకి తీరనిలోటు. పార్టీ పటిష్టత కోసం ఆయన ఎంతో కృషి చేశారు. రాకేష్ చౌదరి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చాను" అని లోకేశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఫొటోలను కూడా పంచుకున్నారు.


