Vangalapudi Anitha: అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేశారు: వంగలపూడి అనిత

- వంశీ అరెస్ట్ సక్రమమే అన్న అనిత
- ఆయన అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని వ్యాఖ్య
- మహిళలను అవమానించిన రాజ్యాలు కూలిపోయాయన్న సవిత
వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ అక్రమమని వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారని... వంశీ అరెస్ట్ సక్రమమేనని చెప్పారు. ఆయన అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని అన్నారు. అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేశారని చెప్పారు.
మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్ మ్యాన్ బ్యాగ్ (బ్యాగ్ లో 30 బుల్లెట్ల మేగజీన్ ఉంది) పోవడం దురదృష్టకరమని... ఆయన నిర్లక్ష్యం వల్లే బ్యాగ్ పోయిందని అనిత అన్నారు. ఈ అంశంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని చెప్పారు.
మరో మంత్రి సవిత మాట్లాడుతూ... టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం, కేసు పెట్టిన వ్యక్తిని బెదిరించడం, కిడ్నాప్ చేయడం వంటి చర్యలు దారుణమని అన్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించారని మండిపడ్డారు. ఆనాటి సీఎం జగన్ అసెంబ్లీలో పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. మహిళలను అవమానించిన రాజ్యాలు కూలిపోయాయని... దీనికి పురాణాలే సాక్ష్యమని చెప్పారు. తల్లిని, చెల్లిని వాడుకుని వదిలేశారని, బాబాయ్ పై గొడ్డలి వేటు వేశారని అన్నారు. అమరావతి మహిళలపై దాడులు చేయించారని మండిపడ్డారు.