Manchu Manoj: రెస్టారెంటుపై బౌన్సర్ల దాడి... స్పందించిన మంచు మనోజ్

- మోహన్ బాబు విద్యాసంస్థల సమీపంలోని రెస్టారెంటుపై బౌన్సర్ల దాడి
- బౌన్సర్లు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న మనోజ్
- బౌన్సర్లను తొలగించాలన్న మంచు మనోజ్
- గొడవ జరగగానే సీసీటీవీ ఫుటేజీని తీసుకువెళుతున్నారని విమర్శ
తిరుపతిలో మోహన్ బాబుకు చెందిన విద్యాసంస్థల సమీపంలోని ఒక రెస్టారెంటుపై బౌన్సర్లు దాడి చేసిన ఘటన పట్ల మంచు మనోజ్ స్పందించారు. దయచేసి బౌన్సర్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. బౌన్సర్లు దాడి చేయడంతో ఈ రెస్టారెంట్ యజమాని పారిపోయాడని తెలిపారు. రెస్టారెంటుపై దాడిని మనోజ్ ఖండించారు. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బౌన్సర్ల సమస్య గురించి తాను గతంలోనే ఫిర్యాదు చేశానని, పోలీసు అధికారులు వెంటనే స్పందించి అప్పుడు చర్యలు తీసుకున్నారని చెప్పారు. రెస్టారెంటుపై దాడి గురించి తనకు నిన్న ఫోన్ కాల్స్ వచ్చాయని, బౌన్సర్లు ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గొడవ జరిగిన వెంటనే సీసీటీవీ ఫుటేజీని తీసుకువెళ్లారని అన్నారు.
హైదరాబాద్‌లో తన ఇంట్లో అయినా, బయట ఎక్కడ గొడవలు జరిగినా సీసీటీవీ ఫుటేజీలు తీసుకుపోతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై దృష్టి సారించాలని స్థానిక ఎమ్మెల్యేను కోరుతున్నానని అన్నారు. ఇక్కడి ప్రజలకు ధైర్యం ఇవ్వాలన్నారు. పదిమందికి సాయం చేయడం కోసం తన తండ్రి ఈ విద్యాసంస్థలను ప్రారంభించారని అన్నారు. ఇప్పుడు దీని మేనేజ్‌మెంట్ ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసని అన్నారు. బౌన్సర్లను తొలగించాలన్నారు.
నిన్న ఓ సినిమా ఫంక్షన్‌కు తనను పిలిస్తే రాయచోటికి వచ్చానని అన్నారు. తాను ఈ ప్రాంతానికి వచ్చానని తెలిసి, ఇక్కడ జరుగుతున్న విషయాలు తన దృష్టికి తీసుకువచ్చిన వారిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై తాను ప్రశ్నించాక తనపై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు. తనతో పాటు తన భార్య, పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు.
తమది ఆస్తి గొడవ కాదని, ఆత్మగౌరవ సమస్య అని ఆయన అన్నారు. తన తండ్రి పదిమందికి మంచి చేయాలని ఈ పాఠశాలను ప్రారంభించారని, ఆయన చేతిలో ఉన్నంత కాలం ఈ క్యాంపస్ బాగానే ఉందని మంచు మనోజ్ అన్నారు. కానీ గత మూడేళ్లుగా ఏదో జరుగుతోందన్నారు. ఇప్పుడు ఈ క్యాంపస్ ఎవరి చేతిలోకి వెళ్లిందో అందరికీ తెలుసని ఆయన అన్నారు.
"ఇలాంటి బెదిరింపు ధోరణిని అంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విష్ణు, వినయ్ కూడా ఈ విషయాన్ని (రెస్టారెంటుపై దాడి ఘటనను) తీవ్రంగా పరిగణించాలి. దయచేసి ప్రేమను పంచండి... ప్రేమతోనే డీల్ చేస్తాం. మనమంతా ఒకటి, మనమంతా ఒక కుటుంబం" అని వ్యాఖ్యానించారు.