Nirmala Sitharaman: తెలంగాణపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు... వినోద్ కుమార్ కౌంటర్

- నిర్మలా సీతారామన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారన్న వినోద్ కుమార్
- ఏపీ పునర్విభజన చట్టం వచ్చిందే తెలంగాణ కోసమని వెల్లడి
- కేసీఆర్ అప్పులు తెచ్చి ఆస్తులను సృష్టించారన్న వినోద్ కుమార్
విభజన తర్వాత తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందని, ఆ తర్వాత పదేళ్లలో అప్పుల కుప్పగా మారిందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాజ్యసభలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పునర్విభజన చట్టం వచ్చిందని, ఈ చట్టంతో సీతారామన్‌కు గానీ, ఇప్పటి బీజేపీ ప్రభుత్వానికి గానీ సంబంధం లేదన్నారు.
తెలంగాణ ప్రజలు, గులాబీ జెండా కలిసి ఈ చట్టాన్ని సాధించుకున్నారని ఆయన అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనను నిర్మలా సీతారామన్ చాలా చులకనగా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణను 1956లో ఆంధ్రాతో కలిపినప్పుడే మిగులు బడ్జెట్‌గా ఉందని, అలాగే 2014లోనూ అలాగే ఉందని వినోద్ కుమార్ అన్నారు. కేసీఆర్ అప్పులు తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా వృథా చేయలేదన్నారు. ఆస్తులను సృష్టించినట్లు చెప్పారు.
జిల్లా కలెక్టరేట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, రేవంత్ రెడ్డి కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ రూం... ఇవన్నీ కేసీఆర్ కట్టినవే అన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని నిర్మించినట్లు చెప్పారు. మెదక్ రైల్వే స్టేషన్ కట్టామని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ అది ఎన్నో ఏళ్ల తర్వాత పూర్తయిందని ఆయన అన్నారు. తెలంగాణ చేసిన అప్పుల గురించి మాట్లాడిన కేంద్ర ఆర్థికమంత్రి గొప్పల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
తెలంగాణకు సొంత రాబడి ఐదు రెట్లు పెరిగినట్లు ఆమె ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ రెండు రోజులు తెలంగాణ పర్యటనకు వస్తే ఇక్కడ జరిగిన అభివృద్ధి తెలుస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణను బద్నాం చేస్తున్నారని, నిన్న నిర్మలా సీతారామన్ కూడా అలాగే బద్నాం చేసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ వెనుక తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని అన్నారు. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.