Cholesterol: చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే... అధిక కొలెస్ట్రాల్ కావొచ్చు!

- ఇటీవలి కాలంలో పెరుగుతున్న అధిక కొలెస్ట్రాల్ బాధితులు
- మారిన జీవన శైలి, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడమే దీనికి కారణం
- అధిక కొలెస్ట్రాల్ ఉంటే చర్మంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయంటున్న వైద్య నిపుణులు
- ముందుగానే గుర్తించి జాగ్రత్త తీసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చని సూచనలు
ఏమాత్రం శారీరక శ్రమ లేని జీవన శైలి, దానికితోడు అధికంగా ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకోవడంతో చాలా మందిలో అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తుతోంది. ఇది మధుమేహం, గుండె జబ్బులకూ దారితీస్తోంది. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో చర్మంపై కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించి ముందే జాగ్రత్తపడితే... అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవచ్చని, గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని స్పష్టం చేస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ తో చర్మంపై కనిపించే సమస్యలు ఇవే...
కాళ్లపై చర్మం రంగు మారడం...
అధిక కొలెస్ట్రాల్ సమస్య మొదలైన వారిలో కాళ్ల దిగువ భాగాన చర్మం రంగు మారుతుంది. అక్కడి చర్మం మిగతా భాగాలతో పోలిస్తే... పాలిపోయి, మెరుస్తూ కనిపిస్తుంటుంది. లేదా ఎరుపు రంగులో పాలిపోయిన మచ్చల్లా ఏర్పడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాలిలోని రక్త నాళాల్లో, చర్మంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతూ ఉండటమే దీనికి కారణం అవుతుందని వివరిస్తున్నారు.
చర్మంపై చిన్నపాటి బొడిపెలు...
కొలెస్ట్రాల్ పరిమితికి మించి ఉన్నవారిలో చర్మంపై పసుపు లేదా నారింజ రంగులో చిన్నని బొడిపెలు ఏర్పడుతాయి. ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, చేతులపై ఇతర భాగాల్లో ఇవి కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మంలో కొలెస్ట్రాల్ నిల్వ అవుతూ ఇలాంటి బొడిపెలు ఏర్పడుతాయని వివరిస్తున్నారు.
కను రెప్పలు, కళ్ల దిగువన పసుపు రంగు చారలు
కళ్ల దిగువన, కనురెప్పలతోపాటు చుట్టుపక్కల భాగాల్లో లేత పసుపు రంగులో చారలు రావడం, అవి కాస్త ఉబ్బెత్తుగా ఉండటం అధిక కొలెస్ట్రాల్ కు లక్షణమని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని ‘జ్సాంతెలెస్మా’గా పిలుస్తారని వివరిస్తున్నారు.
చర్మంపై జిగురులా, మెత్తగా ఏర్పడటం...
శరీరంపై పలుచోట్ల చర్మంపై మెత్తగా, జిగురుగా ఉండే భాగాలు ఏర్పడటం కొలెస్ట్రాల్ పరిమితికి మించిపోయిందని అర్థమని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరం వెనుక భాగంలో వీపు, నడుము కింది భాగంలో ఎక్కువగా ఏర్పడుతాయని వివరిస్తున్నారు.
కనుపాప పాలిపోవడం, బూడిద రంగులోకి మారడం...
కంటి పాప చుట్టూ తెలుపు, బూడిద రంగు, లేదా లేత నీలి రంగులో రింగ్స్ ఏర్పడటం, కనుపాప పాలిపోయినట్టు కనిపించడం కూడా అధిక కొలెస్ట్రాల్ కు సూచిక అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యుక్త వయసు వారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుందని వివరిస్తున్నారు.
గాయాలు మానడంలో ఆలస్యం...
అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త నాళాల్లో రక్తం సరఫరా మందగిస్తుందని, దీనివల్ల శరీరానికి అయిన గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చేతులు, కాళ్లపై గాయాలు మానడానికి అధిక సమయం పడుతుందని వివరిస్తున్నారు.
నలుపు రంగు ప్యాచ్ లు ఏర్పడటం...
చర్మంపై కాస్త మందంగా, నలుపు రంగులో ప్యాచ్ లు ఏర్పడటం అధిక కొలెస్ట్రాల్ లక్షణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మెడ, బాహుమూలాలు, జననావయవాల చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇలా ఏర్పడుతాయని... అధిక కొలెస్ట్రాల్, మధుమేహానికి ఇవి సూచిక అని వివరిస్తున్నారు.
ఈ అంశాలను గమనించండి
పైన చెప్పిన లక్షణాలు ఇతర వ్యాధులు, ఆరోగ్య సమస్యల కారణంగా కూడా తలెత్తే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించి, తగిన సూచనలు తీసుకుని పాటించాలని పేర్కొంటున్నారు.